Ukraine Crisis: అప్పుడు తుపాకుల వేట తరుముకొస్తే.. ఇప్పుడు బాంబుల వర్షం ఉరిమింది..!

అధినేతలు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజానీకంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఉదంతం.

Published : 01 Mar 2022 02:05 IST

గమ్యం తెలియని పయనం చేస్తోన్న అఫ్గాన్ కుటుంబం

(ప్రతీకాత్మక చిత్రం)

మెదికా (పొలండ్‌): అధినేతలు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజానీకంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఉదంతం. పుట్టిన గడ్డ మీద భవిష్యత్తుకు అంధకారం అలముకోవడంతో పొట్ట చేతపట్టుకొని మరో దేశం వస్తే.. అక్కడా అవే పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పుడు తుపాకుల వేట తరుముకొస్తే.. ఇప్పుడు బాంబుల వర్షం ఉరిమింది. మళ్లీ గమ్యం తెలియని పరుగుమొదలైంది. ఇదంతా తనకంటూ ఊరూపేరూ లేకుండా పోతోందని వాపోతున్న అజ్మల్ రెహ్మానీ సంగతి..!

అజ్మల్‌ది అఫ్గానిస్థాన్‌. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంవత్సరం క్రితం వరకు అఫ్గాన్‌లో తన కుటుంబంతో ఏ చీకూచింతా లేకుండా జీవించారు. 18 సంవత్సరాల పాటు నాటోతో కలిసి పనిచేసిన ఆయన.. కాబుల్‌ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా తన సేనల్ని వెనక్కి పిలిపిస్తుందనడానికి నాలుగు నెలలు ముందుగానే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. తన కుటుంబానికి బెదిరింపులు రావడమే ఆ ఆలోచనకు కారణం. చివరకు పిల్లల్ని పాఠశాలకు పంపించలేని దుస్థితి వారికి ఎదురైంది. దాంతో పలు దేశాలకు వీసాకోసం దరఖాస్తు చేయగా.. ఉక్రెయిన్ అవకాశం కల్పించింది. 

‘అఫ్గానిస్థాన్‌లో మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. నాకు ఒక ఇల్లు, కారు ఉన్నాయి. మంచి జీతం వస్తుండేది. కానీ బెదిరింపుల కారణంగా ఇల్లుతో సహా అన్నింటినీ అమ్ముకున్నాను. నా కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదనుకున్నాను. సొంత దేశంలో యుద్ధం నుంచి తప్పించుకొని, మరోదేశానికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ యుద్ధం మొదలైంది. ఇంతకంటే దురదృష్టం ఉంటుందా..?’ అంటూ గమ్యం తెలీని ప్రయాణం మొదలుపెట్టింది అజ్మల్ కుటుంబం. వారు ఉక్రెయిన్ వచ్చాక ఒడెస్సా ప్రాంతంలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రష్యా సైనిక పోరును ప్రారంభించడంతో మళ్లీ అన్నింటిని వదులుకొని 1,110 కిలోమీటర్లు ప్రయాణించి, చివరకు పోలండ్ సరిహద్దుకు చేరుకున్నారు. ఇప్పటివరకు 2,13,000 మంది పొలండ్‌లోకి ప్రవేశించగా.. వీసా లేనివారు 15 రోజుల్లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఓ ఛారిటీ సంస్థ వెల్లడించింది. ఈ కుటుంబానికి వీసా లేదు. ‘భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నా.. పొలండ్ వైపు నుంచి సాదర స్వాగతం లభించింది. ఇది నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు రెహ్మానీ. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని