Published : 16 Aug 2022 01:39 IST

Afghanistan: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్‌.. ఏడాదైనా ఏకాకిగానే..!

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan) నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన వెంటనే ఆ ప్రాంతంపై తాలిబన్లు (Taliban) దండెత్తారు. అదే సమయంలో దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోవడంతో తాలిబన్‌ సేనలు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. అనంతరం అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇలా తాలిబన్‌ పాలన మొదలై ఏడాది పూర్తైనప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో అఫ్గానిస్థాన్‌ ఏకాకిగానే మిగిలిపోయింది.

ఇది జరిగి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం సెలవు దినంగా ప్రకటించారు. అమెరికాపై సాధించిన విజయంగా పేర్కొన్న తాలిబన్లు.. రాజధాని కాబుల్‌లో సంబరాలు చేసుకున్నారు. తలపాగలు ధరించి ఓచేత రైఫిళ్లు, మరోచేత బ్యానర్లు పట్టుకొని రాజధాని కాబుల్‌ వీధుల్లో పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘లాంగ్‌లివ్‌ ఇస్లాం.. డెత్‌ టు అమెరికా’ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు తాలిబన్‌ పాలనలో అఫ్గాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తాలిబన్‌ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోవడంతో.. అఫ్గాన్‌ను పాలించేందుకు వారు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోగా.. అక్కడ నెలకొన్న పరిస్థితులు లక్షల మందిని పేదరికంలోకి నెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్‌వాసులు పొట్టచేతపట్టుకొని దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మహిళ విద్య, ఉద్యోగం విషయాల్లో తాలిబన్లు ఆంక్షలు విధించడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇదిలాఉంటే, గతేడాది ఇదే రోజున అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న వెంటనే దేశం విడిచి వెళ్లేందుకు వేల మంది పౌరులు కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాల వెంట పరుగెడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అక్కడి పరిస్థితులను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించాయి. దాదాపు అన్ని దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి సొంత దేశాలకు తరలించాయి. అనంతరం కాబుల్‌ విమానాశ్రయం మూతబడి పోగా.. కొన్ని దేశాలు మినహా ప్రపంచ దేశాలతో అఫ్గాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో తాలిబన్‌ పాలనలో అఫ్గానిస్థాన్‌ ఏకాకిగానే మిగిలిపోయింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts