Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో సంభవించిన ఘోర ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం (Earthquake) ధాటికి ఏకంగా దేశమే పక్కకు జరిగింది.

Published : 10 Feb 2023 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తుర్కియే (Turkey)లో గత సోమవారం ప్రకృతి సృష్టించిన భూప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం (EarthQuake) ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వాటి శిథిలాల కింద నలిగి ఎన్నో జీవితాలు ముగిసిపోయాయి. ఆ ప్రకంపనల తీవ్రత ఎంతగా ఉందంటే.. ఏకంగా తుర్కియే దేశమే భౌగోళికంగా కదిలిపోయింది.

సాధారణంగానే తుర్కియే భౌగోళికంగా భూకంప ప్రభావిత ప్రాంతాల కూడలిలో ఉంటుంది. ఇక గత సోమవారం సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ధాటికి ఆ దేశం ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు (seismologists) చెబుతున్నారు. తుర్కియే ఉన్న టెక్టానిక్‌ ప్లేట్స్‌ (భూమి పైపొరలోని ఫలకాలు) మధ్య రాపిడి కారణంగా ఈ కదలిక జరిగినట్లు తెలిపారు. తమ అంచనా ప్రకారం.. ఈ భూకంప తీవ్రతతో సిరియాతో పోలిస్తే తుర్కియే (Turkey) 5-6 మీటర్ల పక్కకు జరిగినట్లు ఇటలీకి చెందిన సీస్మాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ కార్లో డగ్లియాని వెల్లడించారు. తుర్కియే భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండు సార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: ‘కదులుతోంది..’ కొంప ముంచుతోంది..!

తాజాగా సంభవించిన భూకంపం తుర్కియే కిందనే ఉన్న తూర్పు అనతోలియన్‌ ఫాల్ట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. గతంలోనే ఇదే ఫలకం రాపిడికి గురై ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇక, తాజా భూకంప కేంద్రం.. నేల నుంచి 18 కి.మీ లోతులోనే ఉంది. అందువల్లే పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం లోతు ఎంత ఎక్కువగా ఉంటే.. నష్టం అంత తక్కువగా ఉంటుంది.

తాజా భూకంపం పెను ప్రాణ నష్టాన్నే మిగిల్చింది. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా వేల మంది శిథిలాల కిందే నలుగుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. తుర్కియే, సిరియా (Syria) దేశాల్లో ఇప్పటికే 15వేల మందికి పైగా ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని