Ukraine Crisis: ‘ఉక్రెయిన్‌ ముగిసింది.. తర్వాత పోలాండే!’ చెచెన్‌ నేత కదిరోవ్‌ వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌.. తాజాగా పోలాండ్‌ను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు కనిపిస్తోన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది....

Published : 27 May 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌.. తాజాగా పోలాండ్‌ను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు కనిపిస్తోన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్‌ పట్ల ఆసక్తిగా ఉంది’ అని ఆయన అందులో వ్యాఖ్యానించారు. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు ఇచ్చినట్లయితే.. ఆరు సెకన్లలో మేం ఏం చేయగలమో చేసి చూపుతాం’ అని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాలు, కిరాయి సైనికులను వెనక్కి తీసుకోవాలని పోలాండ్‌కు డిమాండ్‌ చేశారు. రష్యా దాడికి వ్యతిరేకంగా కీవ్‌కు ఆయుధాలను సరఫరా చేసిన ఐరోపా దేశాల్లో పోలాండ్ ఒకటి.

ఇటీవల రష్యా విక్టరీ డే సందర్భంగా పోలాండ్‌లోని రష్యా రాయబారిపై ఎర్ర సిరాతో దాడి చేసిన ఘటననూ కదిరోవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మా రాయబారి పట్ల ప్రవర్తించినదానికి అధికారికంగా క్షమాపణలు కోరండి. మేం ఈ విషయాన్ని మర్చిపోం. గుర్తుంచుకోండి’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై పుతిన్ సేనల దాడిని కదిరోవ్ మొదట్లోనే స్వాగతించిన విషయం తెలిసిందే. వెంటనే అక్కడికి తన బలగాలనూ పంపారు. తన మనుషుల్లో దాదాపు వెయ్యి మంది అక్కడ ఉన్నారని మార్చి మధ్యలో స్వయంగా వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో పుతిన్‌ అనుకూల వేర్పాటు వాదులకు ఆయన మద్దతు ఉంది. క్రిమియా ఆక్రమణ సమయంలో కూడా రెబల్స్‌కు కదిరోవ్‌ మద్దతు లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని