Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!

రెండు విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని చేశాయి. సకాలంలో పైలట్ల అప్రమత్తతతో.. ఎయిర్‌ ఇండియా, నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన ఆ విమానాలకు పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

Updated : 26 Mar 2023 18:04 IST

కాఠ్‌మండూ: గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా(Air India), నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌(Nepal Airlines)లకు చెందిన విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని చేశాయి. వెంటనే.. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌ పౌర విమానయాన సంస్థ(CAAN) వివరాల ప్రకారం.. నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శుక్రవారం ఉదయం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి కాఠ్‌మండూ(Kathmandu)కు బయల్దేరింది. ఇటు.. దిల్లీ నుంచి కాఠ్‌మండూకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ తీసుకుంది. మార్గమధ్యలో నేపాల్‌లోకి ప్రవేశించాక.. అవి అత్యంత సమీపానికి వచ్చాయి.

ఎయిర్‌ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగుతుండగా.. ఆ సమయంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు అత్యంత సమీపంలో ఉన్నాయని రాడార్‌ హెచ్చరించడంతో.. పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగింది. దీంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తునకు నేపాల్‌ పౌరవిమానయాన సంస్థ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకుగానూ త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని