Air Travel: 16 గంటల ప్రయాణం తర్వాత.. ఎక్కిన చోటుకే మళ్లీ!

Air New Zealand: 16 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం ప్రయాణికులు ఎక్కిన చోటే దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. న్యూజిలాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 17 Feb 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌ (New zealand)- అమెరికా (US) విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. అక్లాండ్‌ నుంచి న్యూయార్క్‌కు బయల్దేరిన విమానం ఒకటి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మళ్లీ బయల్దేరిన చోటుకే వచ్చింది. దిగాల్సిన విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఎయిర్‌ న్యూజిలాండ్‌కు (Air New Zealand) చెందిన విమానం గురువారం సాయంత్రం అక్లాండ్‌ నుంచి బయల్దేరింది. దాదాపు 8 గంటల ప్రయాణించిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణమైంది. విమానం దిగాల్సిన న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో విద్యుదాఘాతం జరగడంతో ల్యాండ్‌ అవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో తిరుగు ప్రయాణమై, విమానం బయలుదేరిన అక్లాండ్‌ విమానాశ్రయంలోనే ప్రయాణికులను దించింది. పాసింజర్స్‌కు ఈ విషయాన్ని ముందుగానే విమాన సిబ్బంది తెలియజేశారు. 

ఈ ఒక్క విమానమే కాదు.. సియోల్‌, రోమ్‌, మిలాన్‌ నుంచి కొన్ని విమానాలు సైతం తిరుగు ప్రయాణమయ్యాయి. మరికొన్ని విమానాలు అమెరికాలోని ఇతర విమానాశ్రయాల్లో ల్యాండ్‌ అయ్యాయి. న్యూజిలాండ్‌ విమాన ఘటనపై కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు’ అని ఓ ప్రయాణికురాలు పేర్కొన్నారు. ‘ఏముంది! రోజంతా విమానంలో ప్రయాణించి ఇంటికొచ్చేశా’నంటూ మరో వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నారు. గత నెల దుబాయ్‌- న్యూజిలాండ్‌ విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దాదాపు 13 గంటలు ప్రయాణించిన విమానం మళ్లీ బయల్దేరిన చోటుకే వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని