Flight Journey: తరగతి తగ్గిస్తే టికెట్‌లో 75శాతం వెనక్కి.. ఫిబ్రవరి 15 నుంచి అమలు

 టికెట్‌ డౌన్‌గ్రేడ్‌ విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయాణ సమయంలో ఒకవేళ తరగతి మారిస్తే.. సదరు ఎయిర్‌లైన్స్‌ టికెట్‌ ధరలో 75శాతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ తెలిపింది.

Published : 25 Jan 2023 23:31 IST

దిల్లీ: విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే విషయం. తీసుకున్న టికెట్‌ కంటే తక్కువ క్లాస్‌కు తగ్గించిన (Ticket Downgrades) సందర్భాల్లో ప్రయాణికుడు ఆ టికెట్‌ ధరలో 75శాతం తిరిగి పొందే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటిని సదరు ఎయిర్‌లైన్స్‌ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు తేవాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాల్లో మాత్రం ఈ రీఇంబర్స్‌మెంట్‌ 30 నుంచి 75శాతం వరకు ఉండనుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు డీజీసీఏ సీనియర్‌ అధికారులు వెల్లడించారు.

ఒక క్లాస్‌లో విమాన టికెట్‌ బుక్‌ చేసుకుంటే.. ఒక్కోసారి ప్రయాణ సమయానికి అది తక్కువ తరగతికి విమానయాన సంస్థలు మారుస్తున్నాయనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిబంధనలు డీజీసీఏ మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా తరగతి మార్చితే.. టికెట్‌ మొత్తాన్ని (పన్నులతో సహా) విమానయాన సంస్థ తిరిగి ప్రయాణికుడికి చెల్లించాలని డీజీసీఏ గత డిసెంబర్‌లో ప్రతిపాదించింది. అంతేకాకుండా అటువంటి ప్రయాణికుడికి తదుపరి తరగతిలో (కింది క్లాస్‌లో) ఉచితంగా తీసుకెళ్లాలని పేర్కొంది.

అయితే, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలు అవుతోన్న నిబంధనలను పరిశీలించిన డీజీసీఏ.. వాటిలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ప్రయాణికుడికి కల్పించే సదుపాయాలకు చెందిన సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌ (CAR) నిబంధనలను మార్చింది. అంతర్జాతీయ ప్రయాణ దూరం 1500 కి.మీ లేదా అంతకన్నా తక్కువ ఉంటే టికెట్లు ధరలో 30శాతం, 1500 కి.మీ నుంచి 3500 కి.మీ మధ్య దూరం ఉంటే 50శాతం, 3500 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న సమయంలో 75శాతం తిరిగి చెల్లించాలని డీజీసీఏ నిర్దేశించింది. దేశీయ ప్రయాణంలో టికెట్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తే మాత్రం 75శాతం తిరిగి ప్రయాణికుడికి చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని