IVF: వాయు కాలుష్యంతో ఐవీఎఫ్‌కు శరాఘాతం

ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బంది తలెత్తవచ్చని ఓ అధ్యయనం తేల్చింది.

Updated : 09 Jul 2024 04:08 IST

దిల్లీ: ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునేవారికి వాయు కాలుష్యంతో ఇబ్బంది తలెత్తవచ్చని ఓ అధ్యయనం తేల్చింది. ఈ విధానం ఫలించి, శిశువు జన్మించడానికి ఉన్న అవకాశాలు.. ఆ ప్రాంతంలోని వాయు నాణ్యతతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఐవీఎఫ్‌ పద్ధతిలో ఒక పరిపక్వ అండాన్ని శుక్ర కణంతో ల్యాబ్‌లో ఫలదీకరణ చేయిస్తారు. ఈ క్రమంలో తయారయ్యే పిండాన్ని.. తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. అక్కడ అది శిశువుగా వృద్ధి చెందుతుంది. ఈ విధానంపై వాయు కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆస్ట్రేలియాలో 3,660 ఐవీఎఫ్‌ ప్రక్రియలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. మహిళ నుంచి పరిపక్వత చెందని అండం (ఊసైట్‌) సేకరించడానికి 24 గంటలు, రెండు వారాలు, నాలుగు వారాలు, మూడు నెలల ముందు ఆయా ప్రాంతాల్లోని వాయు కాలుష్య స్థాయిని విశ్లేషించారు.  

  •  ఊసైట్‌ సేకరణకు రెండు వారాల ముందు వాతావరణంలోని పీఎం10 రేణువులు ఎక్కువగా ఉంటే.. ఐవీఎఫ్‌ పద్ధతి విజయవంతమై, శిశు జననం సంభవించడానికి ఆస్కారం 38 శాతం మేర తగ్గుతుంది. 
  •  అపరిపక్వ అండాన్ని సేకరించడానికి మూడు నెలల ముందు పీఎం 2.5 రేణువులు ఎక్కువగా ఉన్నా ఐవీఎఫ్‌ పూర్తిస్థాయిలో ఫలించడానికి అవకాశాలు తగ్గిపోతాయి. 
  •  అధ్యయనం జరిగిన కాలంలో పీఎం10 రేణువులు 0.4 రోజులు, పీఎం2.5 రేణువులు 4.5 రోజుల పాటు మాత్రమే ఎక్కువ మోతాదులో ఉన్న సందర్భాల్లోనూ ఐవీఎఫ్‌ విధానంపై ప్రతికూల ప్రభావం పడింది. మిగతా రోజుల్లో వాయు నాణ్యత అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండటంలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని