Asteroid: లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!

అమెరికా (America) అంతరిక్ష సంస్థ నాసా (NASA) భూమికి (Earth) అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో (Asteroid) ఓ జాబితాను తయారు చేసింది. అందులోని గ్రహశకలం ‘2023 ఎస్‌ఎన్‌6’ తాజాగా మన భూగ్రహం దిశగా దూసుకొస్తున్నట్లు సమాచారం అందింది. 

Published : 03 Oct 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలో (Space) లక్ష్యం లేకుండా సంచరిస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని (Asteroid) శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక స్థిర మార్గం, గమ్యం లేకుండా ప్రయాణించడం ఆందోళనకు గురిచేస్తోంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ ‘కాస్మిక్‌ నొమాడ్’ కొన్ని సార్లు  ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలకు దగ్గరగా వస్తున్నట్లు తెలిసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భూమికి అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో ఓ జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలోని గ్రహశకలం ‘2023 ఎస్‌ఎన్‌6’ తాజాగా మన భూగ్రహం దిశగా దూసుకొస్తున్నట్లు సమాచారం అందింది. 

2040 నాటికి చంద్రుడిపై 3డీ ఇళ్ల నిర్మాణం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నాసా

ఒక విమానం పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం బుధవారం భూమిని దాటనుంది. అది 4.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ గ్రహశకలం గంటకు 30,564 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని నాసా డేటా పేర్కొంటోంది. ఇది భూమికి సమీపంలోని గ్రహశకలాల అపోలో సమూహానికి చెందినది. 1862 అపోలో గ్రహశకలాలను జర్మన్‌ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ రీన్ముత్ 1930 ప్రాంతంలో కనుగొన్నాడు. అయితే, స్పేస్‌ ఏజెన్సీస్‌ సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌ స్టడీస్‌ (సీఎన్ఈఓఎస్‌) మాత్రం తాజా గ్రహశకలాన్ని ప్రమాదకర వస్తువుగా భావించడం లేదు. 

2022లో నాసా భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని మళ్లించేందుకు ఓ ప్రత్యేక మిషన్‌ను చేపట్టింది. దానికి డబుల్ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్ (డార్ట్‌) అని పేరు పెట్టింది. తొలి దశలో 2022 సెప్టెంబరు 26న నాసా శాస్త్రవేత్తలు పంపించిన స్పేస్‌ క్రాఫ్ట్‌ లక్షిత గ్రహశకలం డైమోర్ఫోస్‌ను ఢీకొంది. క్యూబ్‌ ఆకృతిలో కన్పించే నాసా వాహనం దాదాపు ఓ వెండింగ్‌ మిషన్‌ పరిమాణంలో ఉండేది. అది భూమికి 11 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలంలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని