ప్రయాణికులకు సారీ చెప్పేందుకు.. తైవాన్‌ నుంచి జపాన్‌కు ఎయిర్‌లైన్స్‌ అధిపతి!

తమ సంస్థ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఓ ఎయిర్‌లైన్‌ (Airline) ఛైర్మన్‌ చేసిన పని అంతర్జాతీయంగా వైరల్‌ అయ్యింది. దేశం దాటి వెళ్లి మరీ ఆయన ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేశారు.

Published : 17 May 2023 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అనుకోని పరిస్థితుల్లో విమానాలు ఆలస్యమవడం లేదా రద్దయినప్పుడు ప్రయాణికులు (Airline Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎయిర్‌లైన్‌ సంస్థలు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. కొన్నిసార్లు గంటలు గంటలు ఎయిర్‌పోర్టు (Airport)లో ఎదురుచూడాల్సి వస్తుంది. తాజాగా తైవాన్‌కు చెందిన స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ (Starlux Airlines) విమాన ప్రయాణికులకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్‌ (Japan) ఎయిర్‌పోర్టులో వారు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్‌ అధిపతి.. స్వయంగా ఆ దేశానికి వెళ్లి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు.

జపాన్‌ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 6వ తేదీన స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ (Starlux Airlines)కు చెందిన ఓ విమానం తైవాన్‌ రాజధాని తైపీ బయల్దేరాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దీంతో అందులోని ప్రయాణికులను తైపీ వెళ్లే మరో విమానంలోకి ఎక్కించారు. అప్పటికే ఆ విమానంలో కొంతమంది ప్రయాణికులున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. రెండో విమానం కూడా ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ప్రయాణికులను విమానంలోనే ఉంచిన ఎయిర్‌లైన్‌ సిబ్బంది.. చివరకు విమానం రద్దయిందని తాపీగా చెప్పారు. దీంతో 300 మందికి పైగా ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

దీంతో స్టార్‌లక్స్‌ సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు, సంస్థ ఛైర్మన్‌ చాంగ్‌ కు వీ హుటాహుటిన తైవాన్‌ (Taiwan) నుంచి జపాన్‌ బయల్దేరారు. మే 7వ తేదీన నరిటా ఎయిర్‌పోర్టులో దిగి అక్కడ చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితుల కారణంగా తొలి విమానం ఆలస్యమైంది. దీంతో మరో విమానంలో వారిని పంపించాలని ప్రయత్నించినా.. నిర్వహణ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. రెండో విమానంలోని సిబ్బంది పనివేళలు ముగియడంతో అది కూడా ఆలస్యమైంది. ఇందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ ఇస్తాం’’ అని తెలిపారు. ఎట్టకేలకు 16 గంటలు ఆలస్యంగా ఆ ప్రయాణికులు ఎయిర్‌పోర్టు నుంచి తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు