ఆ మహిళా వర్సిటీ క్యాంపస్‌లో ఫోన్లు నిషేధం.. ఉల్లంఘిస్తే ₹5వేలు ఫైన్‌!

పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థినుల ఫోన్లు వాడకంపై నిషేధం విధించించారు. తాలిబన్‌ మిలిటెంట్లు క్రియాశీలంగా....

Published : 21 Apr 2022 02:03 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థినుల ఫోన్లు వాడకంపై నిషేధం విధించించారు. తెహ్రిక్‌ తాలిబన్‌ మిలిటెంట్లు క్రియాశీలంగా ఉండే ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రాంతంలోని విమెన్‌ యూనివర్సిటీ స్వాబి యాజమాన్యం కఠిన ఆంక్షలు విధించినట్టు సామా టీవీ ఛానల్‌ ఓ కథనంలో పేర్కొంది. దీని ప్రకారం.. స్మార్ట్‌ఫోన్లు, టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ ఫోన్లు లేదా ట్యాబ్‌లను వర్సిటీ పరిసరాల్లోకి అనుమతించబోమని విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 20 నుంచే (బుధవారం) అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు. యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థినులు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారని గమనించి.. ఈ ఆదేశాలు జారీ చేసినట్టు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా ఈ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.5వేలు జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు.

ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రాంతంలో విద్యార్థినుల డ్రెస్‌ కోడ్‌, హెయిర్‌ స్టైల్‌ వంటి వాటిపై తరచూ కఠిన ఆంక్షలు అమలుచేస్తుంటారు. అమ్మాయిలంతా సల్వార్‌ కమీజ్‌ ధరించాలని నిబంధనలు పెడుతుంటారు. గతేడాది మార్చిలో పెషావర్‌ యూనివర్సిటీ కొత్త డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని ఆదేశించింది. తమకు నచ్చిన కమీజ్‌తో పాటు తెల్లని సల్వార్‌ ధరించాలని షరతు పెట్టింది. పురుషులైతే మంచిగా కనబడేలా దుస్తులు ధరించాలని సూచించింది. అలాగే, గతేడాది జనవరిలో హజారా వర్సిటీ యాజమాన్యమైతే విద్యార్థినులు దుపట్టాతో పాటు సల్వార్‌ కమీజ్‌ ధరించాలని ఆదేశించింది. కొత్త రూల్స్‌ పేరిట భారీగా మేకప్‌, నగలు పెట్టుకోవడం, ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌లను నిషేధించిందని సదరు టీవీ ఛానల్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని