Imran Khan: ‘జైలు టు బెయిల్‌’.. ఇమ్రాన్‌ అరెస్టులో కీలక పరిణామాలివే!

అల్‌ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది. అయితే, అరెస్టు నుంచి బెయిల్‌ మంజూరు వరకు చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే..

Published : 12 May 2023 18:42 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌  పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను (Imran Khan) అరెస్టు చేయడం అక్రమమని పాక్‌ సుప్రీం (Pak Supreme Court) కోర్టు గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ ఆయనకు రెండు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. ఇమ్రాన్‌ జైలుకు వెళ్లిన నాటి నుంచి బెయిల్‌ మంజూరు చేసే వరకు చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఓసారి పరిశీలిస్తే..

  • అల్‌ ఖాదిర్‌ ట్రస్టు కేసులో విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం పాక్‌ రేంజర్లు ఇస్తామాబాద్‌ హైకోర్టు (IHC) ఆవరణలోనే అరెస్టు చేశారు.
  • ఐహెచ్‌సీ ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ను బుధవారం నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ)కు అప్పగించారు.
  • ఇమ్రాన్‌ అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ కార్యకర్తలు మంగళవారం నుంచే దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు.
  • నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పాక్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌, పంజాబ్‌, బలోచిస్థాన్‌ తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించింది.
  • దాదాపు 3000 మంది ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ జైళ్లలో నిర్బంధించారు.
  • నిరసనలు హింసాత్మకంగా మారి.. ఇమ్రాన్‌ ఖాన్ మద్దతుదారులు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులు ట్రక్కులకు, కార్లకు నిప్పంటించారు. ఈ ఘటనల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు.
  • ఈ పరిస్థితులు 2007 ఎన్నికల ర్యాలీలో మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య తర్వాత పాక్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను తలపించాయి. భుట్టో హత్య తర్వాత ఆమె మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి లోనై.. పాకిస్థాన్‌ వ్యాప్తంగా రోజుల తరబడి విధ్వంసం సృష్టించారు.
  • హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో గురువారం పాక్‌ పోలీసులు ఇమ్రాన్‌ ఖాన్‌పై ఉగ్రవాద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
  • పాక్‌ రేంజర్లు అరెస్టు చేసి ఎన్‌ఏబీకి అప్పగించిన తర్వాత గురువారం ఇమ్రాన్‌ఖాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన అరెస్టు అక్రమమని ప్రకటించింది.
  • ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించి.. న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా నడచుకోవాలని ఇమ్రాన్‌కు పాక్‌ సుప్రీం కోర్టు సూచించింది.
  • సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. గురువారం రాత్రి ఇమ్రాన్‌ కాన్‌ ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలోనే ఉన్నారు. అక్కడే కుటుంబ సభ్యులను, స్నేహితులను, మద్దతుదారులను కలిశారు. పాక్‌ అధ్యక్షుడు అరిఫ్‌ ఆల్వి కూడా ఇమ్రాన్‌తో మాట్లాడారు.
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం విచారణ చేపట్టిన ఐహెచ్‌సీ ప్రత్యేక ధర్మాసనం.. ఇమ్రాన్‌కు 2 వారాల బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు