Jill Biden: పాక్‌ ‘ఐఎస్‌ఐ’ రాడార్‌లోకి బైడెన్‌ భార్య..!

అమెరికా నిఘా, భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసింది. ఐఎస్‌ఐ ఆదేశాలతో పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులను

Updated : 08 Apr 2022 15:22 IST

వాషింగ్టన్‌: అమెరికా నిఘా, భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసింది. ఐఎస్‌ఐ ఆదేశాలతో పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అరెస్టు చేసింది. వీరిద్దరు గత కొన్ని నెలల నుంచి అమెరికాలో నకిలీ ధ్రువపత్రాలతో ఫెడరల్‌ ఏజెంట్‌ అధికారులుగా చలామణి అయినట్లు తెలిసింది. అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ భద్రతా వ్యవహారాలు చూసే భద్రతా విభాగంలోకి చొరబడేందుకు వీరు ప్రయత్నించినట్లు సమాచారం.

అరియన్‌ తాహిర్‌జాదే, హైదర్‌ అలీ.. పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరూ డిపార్ట్‌మెంట్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) యూనిట్‌లో పనిచేస్తున్నామంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకున్నారు. 2021లో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ అల్లర్ల కేసు దర్యాప్తు కోసం అండర్‌కవర్‌ ఆపరేషన్‌ సాగిస్తున్నట్లు నమ్మించారు. దీని ద్వారా ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిఫెన్స్‌ కమ్యూనిటీకి చెందిన పలువురితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు.

వీరిద్దరూ వాషింగ్టన్‌లోని చాలా అపార్ట్‌మెంట్‌ ప్రాంగణాలపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తెలిసింది. ఎఫ్‌బీఐ, డీహెచ్‌ఎస్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ సీక్రెట్ సర్వీస్‌(యూఎస్‌ఎస్‌ఎస్‌)లో పనిచేసే సిబ్బంది నివాసముండే అపార్ట్‌మెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. అంతేగాక, ఈ విభాగాల్లో పనిచేసే కొందరు సిబ్బందికి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

వైట్‌హౌజ్‌లో పనిచేసే ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌కు ఏడాది పాటు అద్దె లేకుండా అపార్ట్‌మెంట్‌ రెంట్‌కు ఇచ్చినట్లు తెలిసింది. ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ భద్రత విభాగంలో పనిచేసే ఓ సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్‌కు కూడా ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ ఇద్దరితో సంబంధాలు నడిపిన నలుగురు సీక్రెట్‌ సర్వీస్‌ సభ్యులను అడ్మినిస్ట్రేషన్‌ లీవ్‌లో పంపించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరి వద్ద పాకిస్థాన్‌, ఇరాన్‌ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలీ గతంలో ఇస్తాంబుల్‌, దోహా, టర్కీకి వెళ్లినట్లు విచారణలో తేలింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని