America: చైనా- తైవాన్‌ ఉద్రిక్తతల వేళ.. అమెరికా కీలక ప్రకటన!

తైవాన్‌(Taiwan)కు మద్దతు విషయంలో అమెరికా(America) మరో అడుగు ముందుకేసింది. చైనా(China) దూకుడుతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ.. ఆ ద్వీప దేశ రక్షణావ్యవస్థ బలోపేతానికి తాజాగా 1.1 బిలియన్‌ డాలర్ల ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది....

Published : 04 Sep 2022 01:48 IST

వాషింగ్టన్‌: తైవాన్‌(Taiwan)కు మద్దతు విషయంలో అమెరికా(America) మరో అడుగు ముందుకేసింది. చైనా(China) దూకుడుతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ.. ఆ ద్వీప దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి తాజాగా 1.1 బిలియన్‌ డాలర్ల ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది. శత్రుదేశాల క్షిపణుల ట్రాకింగ్‌ కోసం 665 మిలియన్‌ డాలర్ల విలువైన ముందస్తు రాడార్ హెచ్చరిక వ్యవస్థ, యుద్ధనౌకలను నీటముంచే సామర్థ్యం కలిగిన, 355 మిలియన్‌ డాలర్ల విలువైన 60 అధునాతన హార్పూన్ యాంటీ షిప్‌ క్షిపణులతోపాటు 100 ఎయిర్‌ టు ఎయిర్‌ సైడ్‌విండర్‌ క్షిపణుల విక్రయాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయని అమెరికాకు చెందిన రక్షణ భద్రత సహకార ఏజెన్సీ(డీఎస్‌సీఏ) తెలిపింది.

‘తైవాన్‌పై డ్రాగన్‌ తన ఒత్తిడి పెంచుతూనే ఉన్నందున.. ఆ దేశానికి దాని స్వీయ రక్షణ సామర్థ్యాలు కొనసాగించేందుకుగానూ అవసరమైన సైనిక సాయం అందజేస్తున్నాం’ అని వైట్‌హౌస్ సీనియర్ డైరెక్టర్ లారా రోసెన్‌బెర్గర్ ఒక ప్రకటనలో తెలిపారు. తైవాన్ భద్రతకు ఈ ప్యాకేజీ అత్యవసరమని అగ్రరాజ్య విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఈ విక్రయాలను సాధారణ ప్రక్రియగానే పేర్కొంటూ.. బలగాల ఆధునికీకరణ, రక్షణ సామర్థ్యాల నిర్వహణ విషయంలో తైవాన్‌ ప్రయత్నాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చైనా సైనిక చర్యలను ఎదుర్కొనేందుకు ఈ ఆయుధాల కొనుగోలు సహాయపడుతుందని తైవాన్ రక్షణశాఖ పేర్కొంది. ఈ మేరకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.

ఇదిలా ఉండగా.. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన చైనా.. తైవాన్‌ చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ప్రజాస్వామ్యం ముసుగులో చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందంటూ అమెరికాపై మండిపడింది. మరోవైపు.. ఏమైనా సమస్యలు తలెత్తితే తైవాన్‌కు అండగా నిలుస్తామంటూ అమెరికా పలు సందర్భాల్లో ప్రకటనలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని