Washington: వాషింగ్టన్‌లో ఇక బస్సు ప్రయాణం ఉచితం!

ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత  చేరువ చేసేందుకు వాషింగ్టన్‌ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై త్వరలోనే ఓటింగ్‌ జరగనుంది.

Published : 17 Dec 2022 01:50 IST

వాషింగ్టన్‌: ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాలు చర్యలు చేపడుతూనే ఉన్నాయి.  ఈ క్రమంలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ (Washington) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ బస్సు సేవలను ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు చట్టసభ సభ్యులు అంగీకారం తెలపగా.. డిసెంబర్‌ 20న కౌన్సిల్‌ సభ్యులు తుది ఓటింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో 2023 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కరోనా మహమ్మారి అనంతరం రోజువారీ ఖర్చులు పెరగడం, దీనికి తోడు ప్రయాణ ఛార్జీలు కూడా అధికమవడంపై అమెరికన్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజా రవాణా సేవలను ఉచితంగా అందించడం లేదా ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో కరోనా కారణంగా వాషింగ్టన్‌లో మెట్రో ఛార్జీలను కొంతకాలం (2020-2021) మాఫీ చేశారు. కానీ, మళ్లీ వాటిని పెంచడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు. అయితే, తక్కువ ఆదాయం ఉన్న పౌరులను దృష్టిలో ఉంచుకొని ప్రజా రవాణాను ఉచితంగా అందించేందుకు తాజాగా బిల్లును తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్పందించిన కేజ్రీవాల్‌..

మన దేశంలోనూ ఉచితాలపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌లో ఉచితంగా బస్సు సేవలు అందించడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఉచితాలపై రద్దాంతం చేసే కొన్ని పార్టీలు.. దీన్ని కూడా హేళన చేస్తాయా? అని ప్రశ్నించారు. పౌరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉత్తమమైందంటూ ప్రశంసించారు. ఇప్పటికే దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని