Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా..!’ బైడెన్‌ వీడియో వైరల్‌

అమెరికా అధ్యక్షుడు కెనడా పార్లమెంటు వేదికగా.. చైనాను ప్రశంసించడం గమనార్హం. అయితే, కెనడా బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడం దీనికి కారణమైంది.

Published : 25 Mar 2023 14:42 IST

అటావా: అమెరికా(America), చైనా(China)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆయా అంశాలపై ఇరు దేశాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటాయి. అలాంటిది.. ఏకంగా అమెరికా అధ్యక్షుడే చైనాను ప్రశంసించడం గమనార్హం! అదీ.. కెనడా(Canada) పార్లమెంటు వేదికగా. అయితే, కెనడాకు బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడమే దీనికి కారణం. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జో బైడెన్‌(Joe Biden) తొలిసారి కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడా పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఇందులో భాగంగా కెనడా వలస విధానాలపై మాట్లాడుతూ.. పొరపాటున చైనాను మెచ్చుకున్నారు. ‘వలసల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నందుకు.. చైనాను అభినందిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. వెంటనే, జరిగిన పొరపాటుకు నాలుక కర్చుకున్న బైడెన్‌.. ‘క్షమించండి.. కెనడాను అభినందిస్తున్నా’ అని అన్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. తన పొరపాటును సరిదిద్దుకుని.. ‘చైనా గురించి నేనేం ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరు. ఇంకా ఈ విషయంలో వెళ్లదల్చుకోలేదు’ అంటూ బైడెన్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

దక్షిణ అమెరికా దేశాల నుంచి ఏటా 15 వేల మంది వలసదారులను అనుమతించేందుకు కెనడా ఇటీవల ముందుకొచ్చింది. ఈ విషయంలో కెనడాను ప్రశంసించే క్రమంలో ఈ పొరపాటు దొర్లింది. అయితే, ‘అమెరికాకు ఎంత ఇబ్బందికర పరిస్థితి ఇది’ అని బైడెన్‌ వ్యాఖ్యపై డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు ఎరిక్‌ ట్రంప్‌ స్పందించారు. ఆయన మనస్సులో చైనా ఉందంటూ అమెరికా చట్టసభ్యుడు బైరాన్ డొనాల్డ్స్ ట్వీట్‌ చేశాడు. అంతకుముందు జోబైడెన్‌, కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడో కలిసి.. ‘అంతర్జాతీయ వ్యవస్థకు చైనా ఓ దీర్ఘకాలిక సవాలుగా మారింది’ అని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని