H-1B Visa: మార్చి 1 నుంచి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌..!

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీచేసే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ప్రకటించింది.

Published : 31 Jan 2022 01:05 IST

వెల్లడించిన యూఎస్‌సీఐఎస్‌

దిల్లీ: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీచేసే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 18వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోటా కింద జారీ చేసే ఈ వీసాల కోసం (myUSCIS) ఆన్‌లైన్‌ ద్వారా ఆయా సంస్థలు, ప్రతినిధులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని యూఎస్‌సీఐఎస్‌ తాజా ప్రకటనలో వెల్లడించింది.

హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ కోసం పది డాలర్ల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 18 వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి ర్యాండమ్‌ పద్ధతిలో (లాటరీ ద్వారా) వీటిని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 31నాటికి సమాచారం అందిస్తారు. వీసా పొందిన నిపుణులు ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వీలుంటుంది.

ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారు అమెరికాలో పనిచేసేందుకు గానూ అక్కడి ప్రభుత్వం ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్‌-1బీ వీసాను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రతిఏటా కొత్తగా దాదాపు 65వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తుంది. నాన్‌ ఇమిగ్రేషన్‌ (అమెరికాలో కొంతకాలం ఉండేందుకు) కింద ఇచ్చే హెచ్‌-1బీ వీసాలు పొందే వారిలో ఎక్కువగా భారతీయులే ఉండడం గమనార్హం. ఈ వీసా పొందే వారిలో దాదాపు 70శాతం మంది లబ్ధిదారులు భారత్‌ నుంచే ఉంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఎంతోమంది భారతీయ వృత్తి నిపుణులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది హెచ్‌1-బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని