Iran-US: ఇరాన్‌ ఎన్నికలపై అమెరికా కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగలేదని అమెరికా విమర్శించింది.

Published : 06 Jul 2024 23:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ (Iran) అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్‌ పెజెష్కియాన్‌ (Masoud Pezeshkian) విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగలేదని అమెరికా (USA) విమర్శించింది. అందుకే పెద్దసంఖ్యలో స్థానికులు పోలింగ్‌లో పాల్గొనలేదని పేర్కొంది. ‘‘ఈ ఎన్నికలు ఇరాన్‌ ప్రస్తుతం పయనిస్తోన్న మార్గంలో ఎటువంటి మార్పునకూ దారితీయవు. ఆ దేశం మానవ హక్కులకు గౌరవం ఇస్తుందని ఆశలేం లేవు. అభ్యర్థులే స్వయంగా చెప్పినట్లు.. ఇరాన్ విధానాన్ని సుప్రీం లీడర్‌ నిర్ణయిస్తారు. ఆ దేశంతో మేం వ్యవహరించే విధానంపై తాజా ఫలితాల ప్రభావం ఉండదు. అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తేనే టెహ్రాన్‌తో దౌత్యాన్ని కొనసాగిస్తాం. ఆ దేశం విషయంలో మా ఆందోళనలు ఇంకా సమసిపోలేదు’’ అని అగ్రరాజ్య విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా మసౌద్‌ పెజెష్కియాన్‌..!

ఇరానీయన్లందరికీ సేవ చేస్తానని నూతన అధ్యక్షుడు పెజెష్కియాన్ తన విజయ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ తొలి సుప్రీం లీడర్‌ దివంగత అయతొల్లా రుహోల్లా ఖొమెనీ సమాధి వద్ద ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తాను ఎలాంటి తప్పుడు హామీలు ఇవ్వలేదని, అబద్ధాలు చెప్పలేదని పేర్కొన్నారు. ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇరాన్‌లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. సంస్కరణవాదిగా పేరున్న మసౌద్‌ తన ప్రత్యర్థి సయీద్‌ జలిలిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 30 మిలియన్ల మంది ఓటువేయగా పెజెష్కియాన్‌కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశాన్ని ఆంక్షల చట్రం నుంచి బయటకు తీసుకురావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని పెజెష్కియాన్ తన ప్రచారంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని