Malofeev: ఓ రష్యన్‌ సంపద.. ఉక్రెయిన్‌ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!

ఓ రష్యన్‌ వ్యాపారవేత్త నుంచి జప్తు చేసిన ఆస్తిని అమెరికా తొలిసారి ఉక్రెయిన్‌ సాయానికి వినియోగించనుంది. అగ్రరాజ్య అటార్ని జనరల్‌ ఈ మేరకు అధికారం కల్పించారు.

Published : 05 Feb 2023 01:22 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాని(Ukraine Crisis)కి ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా(America) కీలక నిర్ణయం తీసుకుంది! తొలిసారి ఓ రష్యన్‌ వ్యాపారవేత్త ఆస్తులను ఉక్రెయిన్‌ సాయానికి వినియోగించనుంది. తమ ప్రభుత్వానికి ఈ మేరకు అధికారం ఇచ్చినట్లు అమెరికా అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌(Merrick Garland) తాజాగా వెల్లడించారు. ఇటువంటి నిర్ణయం ఇదే మొదటిసారని తెలిపారు. వాషింగ్టన్‌లో గార్లాండ్, ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్‌లు సమావేశమైన క్రమంలో ఈ ప్రకటన వచ్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఆంక్షల ఎగవేత అభియోగాలపై రష్యన్ మిలియనీర్‌ కాన్‌స్టాంటిన్ మాలోఫీవ్(Konstantin Malofeev) నుంచి స్వాధీనం చేసుకున్న 5.4 మిలియన్‌ డాలర్ల సంపద నుంచి ఈ సాయం వెళ్తుందని గార్లాండ్‌ చెప్పారు.

ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిధులను ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. ఉక్రెయిన్‌ పౌరులకు కలిగిన భారీ నష్టానికి పరిహారం అందేలా చూడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రష్యన్ మిలియనీర్ మాలోఫీవ్‌ను తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు నిధులు సమకూర్చే ప్రధాన వనరుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యన్‌ సంస్థలు, పౌరులపై అమెరికా విధించిన ఆంక్షల జాబితాలో మాలోఫీవ్‌ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆంక్షలను అతిక్రమించేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమెరికా ట్రెజరీ ఆయన బిజినెస్‌ నెట్‌వర్క్‌ను బ్లాక్‌లిస్ట్ చేసింది. ఆస్తులను జప్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని