America: కుమారుడికి కొవిడ్‌ పాజిటివ్.. కారు డిక్కీలో బంధించిన తల్లి

అమెరికాలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్‌గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం...

Published : 09 Jan 2022 01:47 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్‌గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాను వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు ఆమె పేర్కొనడం గమనార్హం. టెక్సాస్‌కు చెందిన సారా బీమ్‌ ఉపాధ్యాయురాలు. ఇటీవల హారిస్ కౌంటీలోని డ్రైవ్-త్రూ టెస్టింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే, ఆమె కారు డిక్కీలోంచి మాటలు రావడం గమనించిన ఓ మహిళ.. అక్కడున్నవారికి తెలిపారు. వారు ఈ విషయమై బీమ్‌ను నిలదీశారు. దీంతో ఆమె డిక్కీ తీయగా.. అందులోంచి 13 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. దీంతో కంగుతిన్న వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అతను తన కుమారుడని.. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో, మరోసారి నిర్ధారణ కోసం పరీక్ష చేయించేందుకుగానూ తీసుకొచ్చినట్లు ఆమె అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో తనకు వైరస్‌ సోకకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. అయితే, అతన్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టుకునేవరకు టెస్టు నిర్వహించబోమని ఆ పరీక్ష కేంద్రం సిబ్బంది ఆమెకు స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పూర్తి విచారణ జరిపారు. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని