Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం

అమెరికా(America) తన దూకుడు కొనసాగిస్తోంది! చైనా(China) ఆగ్రహానికి కారణమైన నాన్సీ పెలోసీ(Nancy Pelosi) పర్యటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అగ్రరాజ్య ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం తైవాన్‌(Taiwan)కు...

Published : 15 Aug 2022 01:23 IST

తైపీ: అమెరికా(America) తన దూకుడు కొనసాగిస్తోంది! చైనా(China) ఆగ్రహానికి కారణమైన నాన్సీ పెలోసీ(Nancy Pelosi) పర్యటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అగ్రరాజ్య ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం తైవాన్‌(Taiwan)కు చేరుకుంది. ఆసియా పర్యటనలో భాగంగా మసాచుసెట్స్‌కు చెందిన డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం రెండు రోజులపాటు తైవాన్‌లో పర్యటించనుంది. అమెరికా- తైవాన్ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయని తైవాన్‌లోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

తైపీ, వాషింగ్టన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఈ పర్యటన మరొక సంకేతమని తైవాన్ విదేశాంగ శాఖ ప్రశంసించింది. ‘చైనా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అమెరికా కాంగ్రెస్‌ మరో పర్యటనను ఏర్పాటు చేసింది. డ్రాగన్‌ బెదిరింపులకు భయపడని స్నేహాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్ పట్ల బలమైన మద్దతును చాటుతోంది’ అని పేర్కొంది. పర్యటనలో భాగంగా అమెరికా ప్రతినిధుల బృందం తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్‌తో భేటీ కానుంది. విదేశాంగ మంత్రి జోసెఫ్ వు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్‌కు కృతజ్ఞతలు: తైవాన్‌

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ.. చైనా పెద్దఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. అయితే, నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని పరిరక్షించేందుకు, తైవాన్ జలసంధి అంతటా భద్రతను కాపాడేందుకు.. అమెరికా, జపాన్, భారత్‌తో సహా సమభావన కలిగిన దేశాలతో కలిసి పని చేస్తామని తైవాన్‌ ఆదివారం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ స్వీయరక్షణ సామర్థ్యాల పెంపు ప్రక్రియను కొనసాగిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది.

‘ఇటీవల తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా జరిపిన సైనిక విన్యాసాలతో తైవాన్ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగింది. ఈ క్రమంలోనే.. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష చర్యలను నివారించాలని పిలుపునిచ్చిన భారత్‌తోసహా 50కి పైగా దేశాలకు కృతజ్ఞతలు’ అని తెలిపింది. మరోవైపు.. ఆదివారం సైతం 11 చైనా సైనిక విమానాలు తైవాన్‌ జలసంధి మధ్యరేఖను దాటి తైవాన్‌ వైమానిక రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయని తైవాన్‌ రక్షణశాఖ ఆరోపించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని