Mongolia: మంగోలియాను పీడిస్తున్న జడ్‌

ప్రకృతి వైపరీత్యమైన జడ్‌ కారణంగా మంగోలియా సతమతమవుతోంది. తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్‌ అంటారు.

Published : 13 Jun 2024 06:26 IST

అతి శీతల వాతావరణం కారణంగా 71 లక్షల పశువుల మృతి

హనోయ్‌: ప్రకృతి వైపరీత్యమైన జడ్‌ కారణంగా మంగోలియా సతమతమవుతోంది. తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్‌ అంటారు. అటువంటి వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది అదే. జడ్‌ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయి. దేశంలో జడ్‌ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్‌.అమార్‌ సైఖాన్‌ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది. కానీ, ఇప్పుడు జడ్‌ వల్ల మంగోలియా ఆర్థిక అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్‌ బటోర్‌కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ    సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్‌ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది. ప్రస్తుత జడ్‌ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని