Meloni-Macron: ఫ్రాన్స్‌ అధ్యక్షుడి వైపు మెలోనీ సీరియస్‌ లుక్‌ : వీడియో వైరల్‌

జీ7 సందర్భంగా ఇద్దరు దేశాధినేతల మధ్య చోటుచేసుకున్న ఓ పలకరింపు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

Published : 15 Jun 2024 17:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: జీ7(G7) సమావేశాల్లో భాగంగా ఇటలీ ప్రపంచస్థాయి నేతలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈసందర్భంగా జరిగిన డిన్నర్‌లో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron ), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) పొడిపొడిగా పలకరించుకున్నారు. ఆ సమయంలో ఆమె మెక్రాన్‌ను సీరియస్‌గా చూసిన చూపు వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిదంటే..?

జూన్‌ 13 నుంచి శనివారం వరకు ఇటలీలో జీ7 సమావేశాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా గురువారం నేతలు బిజీబిజీగా చర్చలు జరిపారు. ఈసందర్భంగా మెలోని, మెక్రాన్ మధ్య కూడా భేటీ జరిగింది. జీ7 తుది ప్రకటనలో గర్భవిచ్ఛిత్తి హక్కులను ఎలా పొందుపర్చాలన్న విషయమై వీరిద్దరూ చర్చించుకున్నారు. దానిపై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తుది ప్రకటనలో సురక్షితమైన, చట్టబద్ధ అబార్షన్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఆ పదాన్ని తొలగించడంపై మీడియాతో మాట్లాడుతూ మెక్రాన్‌ విచారం వ్యక్తంచేశారు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం విషయంలో ఫ్రాన్స్‌కున్న అభిప్రాయమే మిగతా దేశాలకు ఉండాలని ఏమీ లేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఈ జీ7 సదస్సును ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉపయోగించుకుంటున్నారని మరోవైపు మెలోనీ ఆరోపించారు.

Modi-Meloni Selfie: మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్‌.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్‌

అనంతరం జరిగిన డిన్నర్‌ సమయంలో మెక్రాన్‌ వైపు మెలోనీ చూసిన చూపు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆయన్ను ఏదో పలకరించాలన్నట్టుగా షేక్ హ్యాండ్‌ ఇవ్వడం కనిపించింది. ఆ దృశ్యాలపై ఇప్పుడు పలు మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇటీవల ఐరోపా యూనియన్‌కు జరిగిన ఎన్నికల్లో మెలోనీ పార్టీతో పాటు పలు జాతీయవాద పార్టీలు మెరుగ్గా రాణించాయి. ఫ్రాన్స్‌లో కూడా అదే పరిస్థితి కనిపించింది. విపక్ష నేషనల్ ర్యాలీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అది ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఆందోళనకు గురిచేసింది. దాంతో ఆయన పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితుల నుంచి లబ్ధి పొందేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని