Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్‌ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్‌

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. లాటిన్‌ అమెరికాలో రెండో నిఘా బెలూన్‌ (Spy Balloon) కన్పించడం కలవరపెడుతోంది. అది కూడా చైనా (China) గూఢచర్య బెలూనే అని పెంటగాన్‌ తెలిపింది.

Updated : 04 Feb 2023 13:28 IST

వాషింగ్టన్‌: చైనా (China)కు చెందిన నిఘా బెలూన్లు అగ్రరాజ్యం అమెరికా (America)ను గుబులుపుట్టిస్తున్నాయి. గురువారం మోంటానా రాష్ట్ర గగనతలంలో ఓ భారీ బెలూన్‌ (Spy Balloon) కన్పించగా.. తాజాగా లాటిన్‌ అమెరికాలో మరో దాన్ని గుర్తించినట్లు పెంటగాన్‌ శుక్రవారం రాత్రి వెల్లడించింది. ‘‘లాటిన్‌ అమెరికా (Latin America) గగనతలం మీదుగా ఓ బెలూన్‌ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో గూఢచర్య బెలూన్‌ అని మేం అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం లేదు’’ అని పెంటగాన్‌ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్‌ ప్యాట్‌ రైడర్‌ వెల్లడించారు.

మరికొద్ది రోజులు అమెరికా గగనతలంలోనే..

గురువారం కన్పించిన బెలూన్‌ (Spy Balloon) మూడు బస్సుల పరిమాణంలో ఉన్నట్లు పెంటగాన్‌ తెలిపింది. ఇది మరికొన్ని రోజులు అమెరికా (US) గగనతలంలోనే ప్రయాణించే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ‘‘బెలూన్‌ ప్రయాణాన్ని ట్రాక్ చేస్తున్నాం. ఇందులో నిఘా సామర్థ్యమున్న పేలోడ్‌లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం ఇది తూర్పు వైపుగా పయనిస్తోంది’’ అని రైడర్‌ వెల్లడించారు. ఈ బెలూన్‌ను కూల్చేయాలా లేదా అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లు పెంటగాన్‌ (Pentagon) వెల్లడించింది.

నిబంధనల ఉల్లంఘనే: శ్వేతసౌధం

ఈ బెలూన్‌ ఉత్తర అమెరికా రాష్ట్రాల్లోని భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తుండటం కలవరపెడుతోంది. బెలూన్‌ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Boden)కు పెంటగాన్‌ సమాచారమిచ్చింది. పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు శ్వేతసౌధం (White House) వెల్లడించింది. అయితే ఈ వివాదంపై స్పందించిన చైనా.. అది ఒక పౌర గగననౌక అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని, గాలుల ప్రభావంతో దశ తప్పి అమెరికా గగనతలంలోకి వచ్చిందని వివరించింది. దీనిపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కెరీన్ జీన్‌ పెర్రీ స్పందిస్తూ.. ‘‘చైనా (China) పొరబాటును అంగీకరించొచ్చు. కానీ మా గగనతలంలోకి ఈ బెలూన్‌ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. దీన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం’’ అని వెల్లడించారు.

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. ఈ నిఘా బెలూన్‌ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్‌ కన్పించడంతో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తన చైనా (China) పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకోవడం గమనార్హం. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రంగా మారే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని