Earthquake: తుర్కియేలో మరో భూకంపం.. మరిన్ని భవనాలు నేలమట్టం!

తుర్కియేను మరో భూకంపం కుదిపేసింది! సరిగ్గా మూడు వారాల అనంతరం ఇక్కడి మాలత్య ప్రావిన్సులో సోమవారం 5.6 తీవ్రతతో భూమి కంపించింది.

Published : 27 Feb 2023 23:53 IST

అంకారా: ఇటీవలి భారీ భూకంపంతో తుర్కియే(Turkey)లో అపార ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిగ్గా మూడు వారాల తర్వాత మరో భూకంపం(Earthquake) తుర్కియేను వణికించింది. దక్షిణ తుర్కియేలోని  మాలత్య(Malatya) ప్రావిన్సులో రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ఇక్కడి యెసిల్‌యూర్ట్‌ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. భారీఎత్తున ప్రకంపనలతో ఇప్పటికే బలహీనంగా మారిన కొన్ని భవనాలు.. తాజా భూకంపంతో కుప్పకూలాయి. నగర మేయర్‌ మెహ్‌మత్‌ సినార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. 69 గాయపడినట్లు తెలిపారు.

ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపంతో తుర్కియే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా తుర్కియేలోని 11 ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో మాలత్య ఒకటి. గత సోమవారం సైతం హతాయ్‌ ప్రావిన్సులో శక్తిమంతమైన భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 వేల ప్రకంపనలు వచ్చినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రకృతి విపత్తులో రెండు దేశాల్లో కలిపి ఇప్పటికే 50 వేలకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల్లో భూకంపం ధాటికి 1.60 లక్షలకుపైగా భవనాలు కూలిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు