NATO: ‘తీవ్ర తప్పిదం’.. ఫిన్లాండ్‌, స్వీడన్‌ల నాటో ప్రకటనలపై రష్యా మండిపాటు!

నాటో సైనిక కూటమిలో చేరాలని ఫిన్లాండ్, స్వీడన్‌లు తీసుకున్న నిర్ణయాలపై రష్యా మరోసారి మండిపడింది. ఈ చర్యలు తీవ్రమైన తప్పిదాలని హెచ్చరించింది. దీనిపై మాస్కో తగిన విధంగా స్పందిస్తుందని తెలిపింది. రష్యా ఉప విదేశాంగ...

Published : 17 May 2022 01:43 IST

మాస్కో: నాటో సైనిక కూటమిలో చేరాలని ఫిన్లాండ్, స్వీడన్‌లు తీసుకున్న నిర్ణయాలపై రష్యా మరోసారి మండిపడింది. ఈ చర్యలు తీవ్రమైన తప్పిదాలని హెచ్చరించింది. దీనిపై మాస్కో తగిన విధంగా స్పందిస్తుందని తెలిపింది. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్ సోమవారం ఈ విషయమై మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాల పరిణామాలతో కూడిన మరో పెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. దీంతో సైనిక ఉద్రిక్తతల స్థాయి పెరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే క్రమంలో.. ఊహాత్మక ఆలోచనలకు వారు తమ ఇంగితజ్ఞానాన్ని పణంగా పెట్టడం శోచనీయమన్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య భద్రత పటిష్ఠం కాదని, రష్యా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాము ఇంతటితో సరిపెట్టుకుంటామనే భ్రమల్లో ఉండకూడదంటూ స్పష్టం చేశారు.

రష్యాతో 1,300 కిలోమీటర్లకుపైగా సరిహద్దు పంచుకొంటున్న ఫిన్లాండ్‌ నాటోలో చేరతామని తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక పరంగా కొన్ని దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న ఈ దేశం.. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ పరిణామాలతో నాటో వైపు మొగ్గింది. స్వీడన్‌ కూడా అదేబాట పట్టింది. స్వీడన్‌ ప్రధాని మాగ్డలీనా అండర్సన్‌ కూడా తమ దేశం ఈ సైనిక కూటమిలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఈ విషయంలో మొదటినుంచే రష్యా ఇరు దేశాలను ఉద్దేశించి హెచ్చరిస్తూ వస్తోంది. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు