MonkeyPox: మంకీపాక్స్‌పై ఆ మందులు పనిచేస్తున్నాయా?

మంకీపాక్స్‌పై ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ (Lancet)లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది.

Published : 25 May 2022 13:36 IST

దిల్లీ: కొవిడ్‌తో ఇంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను తాజాగా మంకీపాక్స్‌ (Monkeypox) కలవరానికి గురిచేస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ఒక్కో దేశానికీ విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. మరోవైపు కరోనాలా ఇది కూడా మరో మహమ్మారి కానుందా? అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ (Lancet)లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది. 

కొన్ని యాంటీవైరల్‌ ఔషధాల (Antiviral Drugs)కు మంకీపాక్స్‌ (Monkeypox) లక్షణాలను తగ్గించే సామర్థ్యం ఉందని తమ పరిశోధనలో తేలినట్లు ‘లివర్‌పూల్‌ హాస్పిటల్స్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టు’కు చెందిన పరిశోధకులు కథనంలో పేర్కొన్నారు. అలాగే ఈ ఔషధాలు తీసుకున్న వ్యక్తి నుంచి వ్యాధి మరొకరికి వ్యాపించే సమయం కూడా తగ్గిందని వెల్లడించారు. ఆసుపత్రిలో మంకీపాక్స్‌ సోకిన కొంతమందికి బ్రిన్సిడోఫోవిర్‌ (brincidofovir), టీకోవిరిమాట్‌ (tecovirimat) అనే రెండు యాంటీవైరల్‌ డ్రగ్స్‌ ఇవ్వడం ద్వారా ఈ ఫలితాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిని స్మాల్‌పాక్స్‌ చికిత్సలో వినియోగిస్తారు. దీంట్లో బ్రిన్సిడోఫోవిర్‌ మంచి ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడించారు. టీకోవిరిమాట్‌పై ఇంకా లోతైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంకీపాక్స్‌ ఆనవాళ్లను రక్తం, గొంతు నుంచి తీసిన నమూనాల ద్వారా గుర్తించొచ్చని తెలిపారు.

మంకీపాక్స్‌ (Monkeypox) చికిత్సకు, వ్యాప్తి నియంత్రణకు ఇంకా నిర్ధిష్టమైన విధానాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. తాజా పరిశోధన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా మరింత లోతైన అధ్యయనం జరిపేవారికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా చూస్తే మంకీపాక్స్‌కు మనుషుల మధ్య వేగంగా వ్యాపించే సామర్థ్యం లేదన్నారు. అలాగే మొత్తంగా ప్రజారోగ్య వ్యవస్థలకు ఇది పెద్ద ముప్పేమీ కాకపోచ్చునని తెలిపారు. అయితే, కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. మరింత కచ్చితమైన సమాచారం రావాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని