Viral video : సింగపూర్‌లో 100 కేజీల బాంబు పేల్చివేత!

సింగపూర్‌లో (Singapore) 100 కేజీల బాంబును ఆ దేశ ఆర్మీ పేల్చివేసింది. దాన్ని వేరే చోటుకు తరలించే వీలు లేకపోవడంతో పేల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. 

Updated : 26 Sep 2023 19:53 IST

Image : The Singapore Army

సింగపూర్‌ : సింగపూర్‌లోని  (Singapore) ఓ నిర్మాణ స్థలంలో బయటపడిన 100 కేజీల బాంబును (Bomb) ఆ దేశ ఆర్మీ నిపుణులు పేల్చివేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సింగపూర్‌లోని బకిట్‌ టిమా శివారులోని ఓ నిర్మాణ స్థలంలో బాంబు కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆర్మీ సాయం తీసుకొని అది రెండో ప్రపంచ యుద్ధ కాలం (World War ll) నాటిదని తేల్చారు. బాంబును వేరొక చోటుకు తరలించడం సాధ్యం కాదని గుర్తించి చివరకు దాన్ని అక్కడే పేల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం చుట్టుపక్కల నివాసం ఉంటున్న 4వేల మందిని ఖాళీ చేయించారు. బాంబు పేలుడు వినిపించే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని ముందే ప్రకటన జారీ చేశారు. 

అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్‌కు హెచ్చరిక

బాంబు పేల్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా సింగపూర్‌ ఆర్మీ అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 40 మంది భద్రతా సిబ్బంది ఇసుక సంచులతో పేలుడు పరికరాన్ని కప్పేశారు. ఆ తరువాత చుట్టూ కాంక్రీటు బ్లాకులను అమర్చారు. ముందుగా నిర్దేశించుకున్న సమయం ప్రకారం బాంబును బ్లాస్ట్‌ చేశారు. దాంతో భారీ శబ్దం వినిపించింది. పేలుడు తరువాత ఆ ప్రాంతం సురక్షితమని నిర్ధారించుకున్న తరువాతే ప్రజలను తిరిగి తమ ఇళ్లలోకి అనుమతించారు. కాగా..  పేల్చివేసిన బాంబులో 47 కేజీల దాకా మందుగుండు ఉండొచ్చని ఓ మీడియా సంస్థ పేర్కొంది. దాంతో చుట్టుపక్కల నిర్మాణాలన్నింటినీ పేల్చివేయొచ్చని తెలిపింది. సింగపూర్‌లో గతంలోనూ ఇలాంటి బాంబులు వెలుగు చూశాయి. జియాక్‌ కిమ్‌ స్ట్రీట్‌లో 50 కేజీల బాంబు, మండాయ్‌లో 100 కేజీల బాంబు బయటపడ్డాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు