Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’

ఒకవేళ విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు చేస్తే.. సంబంధిత దేశం రష్యాపై యుద్ధాన్ని ప్రకటించినట్లుగా భావిస్తామని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ వ్యాఖ్యానించారు. పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Published : 24 Mar 2023 01:41 IST

మాస్కో: రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin)పై అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) ఇటీవల అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఆయనకు అరెస్టు ముప్పు లేనప్పటికీ.. ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే, విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్‌(Dmitry Medvedev) వ్యాఖ్యానించారు. విదేశాల్లో పుతిన్‌ అరెస్టు ప్రయత్నాలను ‘యుద్ధ ప్రకటన’గా చూస్తామని హెచ్చరించారు. అరెస్టు అసాధ్యమని పేర్కొంటూనే.. ఒకవేళ ఇదే జరిగితే రష్యన్‌ ఆయుధాలు ఆ దేశాన్ని తాకుతాయన్నారు.

‘పుతిన్‌ అరెస్టు అనేది ఎప్పటికీ జరగని పని. కానీ, ఒకసారి ఊహిద్దాం. జర్మనీకి వెళ్లిన సమయంలో పుతిన్‌ను అరెస్టు చేశారనుకుందాం. అంటే.. రష్యాపై జర్మనీ యుద్ధాన్ని ప్రకటించినట్లే’ అని మెద్వెదేవ్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. బుండెస్టాగ్‌(జర్మనీ పార్లమెంట్‌), ఛాన్స్‌లర్ కార్యాలయం తదితర ప్రదేశాల్లోకి మాస్కో రాకెట్లు, ఇతర ఆయుధాలు దూసుకెళ్తాయని చెప్పారు. ఐసీసీ ఇటీవలి నిర్ణయం.. పశ్చిమ దేశాలతో ఇప్పటికే దెబ్బతిన్న తమ సంబంధాలను మరింత దిగజార్చుతుందన్నారు. పుతిన్‌పై అరెస్టు వారెంటు చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. ఐసీసీ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్, ఇతర న్యాయమూర్తులపై రష్యా క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించిన వేళ మెద్వదేవ్‌ ఈ మేరకు స్పందించారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ.. ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అయితే, తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. క్షిపణులతో దాడి చేయగలమంటూ ఐసీసీకి మెద్వెదేవ్‌ ఇటీవల హెచ్చరికలు సైతం జారీ చేశారు. మరోవైపు.. పుతిన్‌పై వారెంట్‌కు వ్యతిరేకంగా వస్తోన్న బెదిరింపులపై ఐసీసీ స్పందించింది. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా నిషేధిత కార్యకలాపాలపై తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు యత్నించడం విచారకరమని ఒక ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు