Artemis 1: ఎట్టకేలకు చందమామపైకి బయల్దేరిన ఆర్టెమిస్‌-1..!

నాసాను రెండు నెలలపాటు ఊరించిన ఆర్టెమిస్‌-1 యాత్ర ఎట్టకేలకు మొదలైంది. నేటి ఉదయం కెన్నడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఆర్టెమిస్‌ గాల్లోకి ఎగిరింది. 

Published : 16 Nov 2022 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు రెండునెలలుగా నాసా కలలు గంటున్న ఆర్టెమిస్‌-1 ప్రయోగం ఎట్టకేలకు విజయవంతంగా మొదలైంది. రెండు హరికేన్లు, సాంకేతిక లోపాలను దాటుకొచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఫ్లొరెడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్‌ 1 రాకెట్‌ గాల్లోకి ఎగిరింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపడానికి ఈ ప్రయోగం దోహదపడనుంది. దీనితోపాటు వ్యోమగాములు లేని ఒరాయన్‌ స్పేస్‌ క్యాప్సుల్‌ను కూడా తీసుకెళ్లింది. దాదాపు 25 రోజులపాటు 1.3 మిలియన్‌ మైళ్లు ఇది ప్రయాణించనుంది. 

అమెరికాలోని ఫ్లొరెడా నుంచి ప్రయోగించిన ఆర్టెమిస్‌-1కు సంబంధించిన ట్రాకింగ్‌ మాత్రం ఐరోపాలోని ఇంగ్లాండ్‌ నుంచి జరుగుతుంది. ఇక్కడి గూన్‌హిల్లీ ఎర్త్‌ స్టేషన్‌ నుంచి ఒరాయన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రయాత్రను ట్రాక్‌ చేయనున్నారు. మెర్లిన్‌ పేరిట నిర్మించిన భారీ డిష్‌యాంటెన్నాను ఇందుకోసం వినియోగించనున్నారు. 1969లో నిర్వహించిన చంద్రయాత్రలో కూడా గూన్‌హిల్లీ ఎర్త్‌స్టేషన్‌ కీలక పాత్ర పోషించింది. 

ఒరాయన్‌ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పనిచేయగలదు. ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్‌ కీలకం. రోదసి యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొనేలా దీన్ని తయారుచేశారు. క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్‌ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సౌరఫలకాలు ఉంటాయి.

భూమికి తిరిగి రావడానికి ఒరాయన్‌  గంటకు 40వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి దూసుకొస్తుంది. ఆ దశలో గాలి రాపిడి వల్ల ఒరాయన్‌పై 2,750 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడి ఉత్పత్తవుతుంది. దీన్ని తట్టుకునేలా ఆ వ్యోమనౌకకు ప్రత్యేక ఉష్ణరక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని