New Research: రొమ్ము క్యాన్సర్‌తో పోరాడేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయం

రొమ్ము క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించేందుకు ఏఐ సహాయపడుతుందని నూతన అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Published : 09 Jul 2024 23:49 IST

దిల్లీ: క్యాన్సర్‌ అనేది ఓ ప్రాణాంతక వ్యాధి. దాని బారిన పడి ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన సాంకేతికతలతో క్యాన్సర్‌ను జయించినవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ అనే మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లోనే దీని బారిన పడుతున్నారు. అయితే రొమ్ము క్యాన్సర్‌తో పోరాడేందుకు కృత్రిమ మేధ (Artificial Intelligence) ఉపయోగపడుతుందని నూతన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 

ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌(IRAC) ప్రచురించిన ప్రపంచ క్యాన్సర్‌ నివేదిక 2022 ప్రకారం భారత్‌లో మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో రొమ్ము క్యాన్సర్‌ (Breast Cancer) కేసులు 13.6 శాతం. క్యాన్సర్‌ బారిన పడ్డ మహిళల్లో 26 మంది ఈ మహమ్మారితోనే బాధపడుతున్నారు. అమెరికాలో కొత్తగా క్యాన్సర్‌ సోకిన బాధిత మహిళ్లలో 30 శాతం మంది రొమ్ము క్యాన్సర్‌ బాధితులే ఉంటున్నారు. అయితే ఈ భయంకరమైన రొమ్ము క్యాన్సర్‌ను  గుర్తించేందుకు, చికిత్సలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఎంతో ఉపకరిస్తుందని కొత్త పరిశోధనలు పేర్కొంటున్నాయి. 

గత నెలలో క్యాన్సర్‌కు సంబంధించి క్యాన్సర్స్‌ జర్నల్‌లో రిసెర్చ్‌ పేపర్‌ ప్రచురితమైంది. అందులో బాధితుల్లో వివిధ రొమ్ము క్యాన్సర్‌లను వర్గీకరించి, గుర్తించే ఏఐ మోడల్‌ గురించి వివరించారు. నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ, మైన్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసర్చ్‌ పరిశోధకులు హై రిజల్యుషన్‌ ద్వారా హిస్టోపాథలాజికల్‌ స్లైడల్‌ను ఉపయోగించి ఏఐ రొమ్ము క్యాన్సర్‌ కణాలను విశ్లేషించేలా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. దీంతో గత డేటాతో నిర్ధారించుకొని అవి క్యాన్సర్‌ కణితులా లేదా అని ఏఐతో గుర్తించగలిగారు. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రేక్‌హిస్‌ (Breast Cancer Histopathological Database), బీఏసీహెచ్‌ (Breast Cancer Histopathology images) వంటి అంశాల్లో ఏఐకి శిక్షణ ఇచ్చారు. బీఏసీహెచ్‌ కోసం మైక్రోస్కోపిక్‌ రొమ్ము కణాలకు సంబంధించిన ఫొటోలను 4 రకాలుగా విభజించి వైద్య నిపుణులతో ఏఐలో పొందుపరిచారు. అదేవిధంగా బ్రేక్‌హిస్‌ కోసం రొమ్ము కణితులకు సంబంధించిన 9,109 మైక్రోస్కోపిక్‌ చిత్రాలను 4 ఉపవర్గాలుగా విభజించి పొందుపరిచారు.

రొమ్ము క్యాన్సర్‌ పరిశోధనా సమయంలో ఏఐ 99.84 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఈ పరిశోధనతో రోగ నిర్ధారణలు మాత్రమే కాకుండా రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణలో ఏఐ పురోగతి ప్రపంచానికి ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది. ఏఐ బయాప్సిలో కణితిని కచ్చితంగా గుర్తిస్తుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న బయోఇంజినీరింగ్‌ ఫ్రొఫెసర్‌ సయ్యద్‌ అమల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని