Artificial Intelligence: వైద్యులకు ఏఐ అండ!

ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు.

Updated : 16 Jun 2024 09:34 IST

రోగుల ఆరోగ్య క్షీణతను ముందే పసిగట్టేందుకు వీలు

న్యూయార్క్‌: ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. రోగుల్లో ప్రతికూల మార్పులను ముందే పసిగట్టి, వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తే.. ఆసుపత్రుల్లో వైద్య పరిరక్షణ 43 శాతం మెరుగుపడుతుందని, అకాల మరణాలూ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. న్యూయార్క్‌లోని మౌంట్‌ సైనాయ్‌ ఆసుపత్రి నిపుణులు ఈ పరిశోధనలు చేశారు. 

రోగులకు సంబంధించిన వివిధ రకాల డేటాపై శిక్షణ పొందిన ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు చేసే హెచ్చరిక సందేశాలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేశారు. తరచూ రోగులు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ చికిత్స పొందాల్సిన అవసరాన్ని ఇవి తప్పించగలవా? ఆసుపత్రిలో  అకాలమరణాల ముప్పును తగ్గించగలవా అన్నది విశ్లేషించారు. ఇందులో భాగంగా 2,740 మంది రోగులను పరిశీలించారు. వారిని రెండు బృందాలుగా విడగొట్టారు. ఒక బృందాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం క్షీణించే ముప్పును ముందే పసిగట్టేందుకు ఏఐ సాధనాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాల ఆధారంగా అవి అప్పటికప్పుడు సంబంధిత వైద్యులకు హెచ్చరిక సందేశాలు పంపుతాయి. రెండో బృందానికీ ఇదే తరహా సాధనాలు అమర్చారు. అయితే వాటి నుంచి అప్రమత్తత సందేశాలు వైద్య బృందానికి వెళ్లవు. ఈ ప్రయోగం కోసం ఆరోగ్య క్షీణతను ముందే పసిగట్టే డిటీరియోరేషన్‌ అల్గోరిథమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మరో 15 ఏఐ ఆధారిత తోడ్పాటు సాధనాలను ఆయా ఆసుపత్రిల్లో అమర్చారు. 

రోగులకు ప్రయోజనం

తమ ఆరోగ్యానికి సంబంధించి ఏఐ పంపిన అప్రమత్తత సందేశాల వల్ల రోగులకు మంచి ప్రయోజనం కలిగిందని వెల్లడైంది. వీటిని పరిశీలించిన వైద్యులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఆ రోగులకు గుండె, రక్తప్రసరణ తోడ్పాటుకు సకాలంలో ఔషధాలు అందాయి. అందువల్ల తదుపరి 30 రోజుల్లో వారికి మరణం ముప్పు తగ్గిపోయింది.  ఈ ఏఐ నమూనాలు చాలా కచ్చితత్వంతో కూడుకున్నవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని