Justin Trudeau: ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..

వచ్చే ఏడాది జీ7 సదస్సు కెనడాలో జరగనుంది. దీనికి భారత్‌ను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్న ట్రూడోకు ఎదురైంది. దీనికి ఆయన చాలా లౌక్యంగా సమాధానం ఇచ్చారు. 

Published : 17 Jun 2024 10:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇటలీలోని జీ7 సదస్సులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. వచ్చే ఏడాది కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తారా..? అన్న ప్రశ్న పలువురి మదిలో నెలకొంది. ఓ విలేకరి ఏకంగా ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)నే అడిగేశారు. దానికి ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. 

సదస్సులో భాగంగా కెనడా ప్రధానితో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్‌ 2025లో మీ దేశంలో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ (PM Modi)ని ఆహ్వానిస్తారా..? అని ప్రశ్నించారు. దీనికి ట్రూడో స్పందిస్తూ.. ‘‘వచ్చే ఏడాది జీ7 సదస్సు కోసం చూపిస్తున్న ఆసక్తికి వారిని అభినందిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ ఏడాది మొత్తం ఈ గ్రూపు అధ్యక్షత ఇటలీనే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో మేము విస్తృత అంశాల్లో జార్జియా మెలోనీ, మిగిలిన జీ7 భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం. వచ్చే ఏడాది మేము ఈ గ్రూపు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే.. జీ7 గురించి చాలా విషయాలు చెబుతాను’’ అని వెల్లడించారు.

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది కెనడాలోని అల్బర్టా ప్రావిన్స్‌లోని కననాస్కిస్‌లో దీనిని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇక జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ట్రూడో మాట్లాడుతూ ‘ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ, కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను మేం డీల్‌ చేస్తాం’ అని ట్రూడో జీ7 చివరిరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని