Putin: ఉక్రెయిన్‌పై యుద్ధం.. ఆత్మాహుతి దాడులకు ‘పుతిన్‌’ ప్రణాళిక..?

ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) ఏడాదిగా యుద్ధం చేస్తోన్న రష్యా (Russia).. రానున్న రోజుల్లో ఈ దాడులను ముమ్మరం చేయవచ్చని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చనే తాజా నివేదిక విశ్లేషించింది.

Published : 04 Mar 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) రష్యా సైనిక చర్య ప్రారంభించి ఏడాది దాటింది. అయినప్పటికీ.. తాను అనుకున్న లక్ష్యాలను సాధించే వరకూ యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా (Russia) చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై ఆత్మాహుతి దాడులకు తెగబడేందుకు పుతిన్‌ (Vladimir Putin) యోచిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన ఓ రహస్య విశ్లేషణను తాజా నివేదిక ఉటంకించింది.

ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో సైన్యాన్ని కోల్పోవడం, ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిఘటనతో.. మొదట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను రష్యా సాధించలేకపోతుందని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ పుతిన్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా సేనలను ఉక్రెయిన్‌పైకి పంపిస్తూనే ఉన్నారు. సాయుధ బలగాలు సరైన సమన్వయంతో వ్యవహరించడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణ మరింత ఉగ్రరూపం దాల్చనుందని.. అందులో భాగంగా పుతిన్‌ మూడు రకాల పరిస్థితులను ఎదుర్కోవచ్చని తాజా నివేదిక విశ్లేషించింది.

ఉక్రెయిన్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యేలా రష్యా మరిన్ని దాడులకు పాల్పడటం, పాశ్చాత్య దేశాలు సమకూరుస్తున్న ఆయుధాల సాయంతో ఉక్రెయిన్‌ మాస్కోపై పైచేయి సాధించడం, రష్యా సైన్యంతోపాటు యుద్ధంపై స్థానికంగా విశ్వాసం కోల్పోవడం వంటి పరిస్థితులు పుతిన్‌ ముంగిట ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇటువంటి తరుణంలో ఫిరంగిదళాల ముసుగులో సరైన శిక్షణలేని సైనికులతో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఎత్తుగడను రష్యా దళాలు అనుసరించవచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. ఇందుకు సంబంధించి వచ్చే మూడు నెలల్లోనే సైనికులకు పుతిన్‌ ఆదేశాలు ఇవ్వవచ్చని తెలిపింది.

మరోవైపు సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా.. ఏడాది కాలంగా దాడులను కొనసాగిస్తూనే ఉంది. దీంట్లో ఇప్పటివరకు 7వేలకు పైగా ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 లక్షల మంది తన సొంత ఇళ్లను వదిలిపెట్టి వెళ్లారు. ఏడాది కాలంగా జరుగుతోన్న దురాక్రమణతో చాలా నగరాలు మట్టి దిబ్బలుగా మిగిలిపోయాయి. మరోవైపు రష్యా కూడా భారీ స్థాయిలో సైన్యాన్ని కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని