AstraZeneca: ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోన్న ఆస్ట్రాజెనెకా బూస్టర్‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా (Vaxzevria) బూస్టర్‌ డోసు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Updated : 13 Jan 2022 16:56 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా (Vaxzevria) బూస్టర్‌ డోసు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్‌తోపాటు డెల్టా, బీటా, అల్ఫా, గామా వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీలను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా లేదా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వినియోగంలో ఉన్న దేశాలకు బూస్టర్‌ ప్రయోగ ఫలితాల సమాచారాన్ని అంజేస్తామని తెలిపింది. ఇప్పటికే పలు దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీ ప్రారంభించిన వేళ.. తాజా ఫలితాలు ఊరట కలిగిస్తున్నాయి.

వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌ను బూస్టర్‌ డోసు ఏ మేరకు ఎదుర్కొంటుందన్న అంశాన్ని పరిశీలించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా మూడు డోసుల వల్ల ఈ వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ బూస్టర్‌ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను ఆ సంస్థ విడుదల చేసింది. ‘తొలి రెండు డోసుల్లో అదే వ్యాక్సిన్‌ లేదా ఎంఆర్‌ఎన్‌ఏ (ఫైజర్‌, మోడెర్నా) వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆస్ట్రాజెనెకా (Vaxzevria) బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు నిరూపించాయి’ అని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆండ్రూ పొలార్డ్‌ పేర్కొన్నారు.

కొత్త వేరియంట్ల ప్రభావంతో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. బూస్టర్‌ డోసుల వినియోగాన్ని పలు దేశాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసులు ఏమేరకు ప్రయోజనం కలిగిస్తాయనే విషయంపై పరిశోధనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ఎంఆర్‌ఎన్‌ఏ (ఫైజర్‌, మోడెర్నా)తోపాటు కొవాగ్జిన్‌ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా ఆ జాబితాలో ఆస్ట్రాజెనెకా కూడా చేరింది. భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో మెజారిటీ ప్రజలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని