America: టోర్నడోల విధ్వంసం.. 23 మంది మృతి..!

అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి మిసిసిపీ రాష్ట్రంలో దాదాపు 23 మంది మృతి చెందారు.

Published : 25 Mar 2023 20:41 IST

వాషింగ్టన్‌: అమెరికా(America)లో సుడిగాలు(Tornado)లు విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి మిసిసిపీ(Mississippi) రాష్ట్రంలో బలమైన గాలులతోపాటు ఓ టోర్నడో ధాటికి దాదాపు 23 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. సుడిగాలుల బీభత్సానికి మిసిసిపీ, అలబామా(Alabama), టెన్నసీ(Tennessee)ల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల వ్యవధిలో మిసిసిపీ, అలబామాల్లో 11 టోర్నడోలు నమోదైనట్లు చెప్పారు.

‘విధ్వంసకరమైన టోర్నడోల కారణంగా మిసిసిపీలో దాదాపు 23 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’ అని స్థానిక గవర్నర్‌ టేట్‌ రీవ్స్‌ ట్వీట్‌ చేశారు. టోర్నడోల ధాటికి ముఖ్యంగా మిసిసిపీలో షార్కీ కౌంటీలోని సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్‌, జాక్సన్‌లతోపాటు వినోనా, హంఫ్రీస్, కరోల్ కౌంటీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలబామా, మిసిసిపీ, టెనసీవ్యాప్తంగా 83 వేలకుపైగా ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు పవర్‌ఔటేజ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. విపత్తు బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు