Gaza: గాజాలో ఇజ్రాయెల్‌ దాడి.. 39 మంది మృతి

గాజాలో రోజుకో విషాదం. ఇజ్రాయెల్‌ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్‌ నిర్వహించిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

Updated : 23 Jun 2024 06:30 IST

రమల్లా: గాజాలో రోజుకో విషాదం. ఇజ్రాయెల్‌ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్‌ నిర్వహించిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన అల్‌-షాతి శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు అల్‌ తుఫా జిల్లాలో చనిపోయారు. అల్‌ షాతిపై ఇజ్రాయెల్‌ దళాలు దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ శిబిరంపై దాడులు జరిగాయి. వైమానిక దాడుల తర్వాత ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. ఇజ్రాయెల్‌సైన్యం మాత్రం తాము హమాస్‌ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని పేర్కొంది. మరోవైపు ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధవాహకనౌక ఐసెన్‌ హోవర్‌తో పాటు.. మరో నౌకపై దాడి చేసినట్లు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎప్పుడు ఈ దాడి చేశామన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఐసెన్‌హోవర్‌ స్వదేశానికి తరలి వెళ్లనుందన్న వార్తలు వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని