Sudan: ఆకలికి తట్టుకోలేక 60 మంది చిన్నారులు మృతి.. పాలు లేక నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు..!

Sudan crisis: భద్రతాబలగాల మధ్య పోరుతో సూడాన్‌లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అక్కడి ప్రజలు, మరీ ముఖ్యంగా నెలల వయస్సులో ఉన్న పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. 

Updated : 01 Jun 2023 18:33 IST

ఖార్తూమ్‌: సూడాన్ (Sudan)లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య జరుగుతోన్న ఆధిపత్యపోరు.. అక్కడి ప్రజల పాలిట శాపమైంది. లక్షల్లో ప్రజలు వలసబాట పట్టారు. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని నగరం ఖార్తూమ్‌లోని ఓ అనాథశరణాలయం(orphanage) నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. అక్కడి పాలకులు ఆధిపత్య పోరులో పడి పసిప్రాణాల సంగతే మర్చిపోయారు. అందుకే పాలు పట్టాల్సిన ఆ నోటికి నీటిని అందించాల్సిన దుర్భర స్థితి నెలకొంది. దాంతో ఆకలి తాళలేక, వైద్యసదుపాయం అందక చిన్నారులు అసువులు బాసారు.  అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం..(Sudan crisis) 

ఆరువారాల వ్యవధిలో ఖార్తూమ్‌లోని అనాథశరణాలయం(Khartoum orphanage)లో 60 మంది శిశువులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 26 మంది రెండురోజుల వ్యవధిలోనే చనిపోయారు. వారికి తగిన ఆహారం లభించకపోవడం, జ్వరం వల్ల ఈ మరణాలు సంభవించాయని శరణాలయ సిబ్బంది వెల్లడించిన వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాల్లోని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొన్ని దృశ్యాల్లో మృతి చెందిన చంటిబిడ్డలను ఖననం చేసేందుకు తెల్లటి షీట్లలో చుట్టి ఉంచారు. ఒక గదిలో నేలపై పదుల సంఖ్యలో పసిపిల్లలు ఉండగా.. వారిలో కొందరు ఏడుస్తూ కనిపించారు. వారి ఆకలి తీర్చేందుకు ఓ మహిళ రెండు జగ్గుల నిండా నీటిని తీసుకెళ్లి తాగించడం కలవరపెడుతోంది. 

ఇదొక విపత్కర పరిస్థితి అని, అంతర్యుద్ధం ప్రారంభమైన మొదటిరోజే ఈ దుస్థితి వస్తుందని ఊహించామని శరణాలయ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. ఇక్కడి పరిస్థితులపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం కావడంతో యునిసెఫ్, రెడ్‌క్రాస్‌ సహకారంతో స్థానిక ఛారిటీ సంస్థ మే 28న ఆహారం, మెడిసిన్‌, బేబీ ఫార్ములాను సరఫరా చేసింది. ఇదిలా ఉంటే.. వెంటనే ఆ చిన్నారులను ఖార్తూమ్‌ నుంచి తరలించకపోతే.. మరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. 

సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సూడాన్ (Sudan) అతలాకుతలమవుతోంది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు జరుగుతుండటంతో ఇప్పటివరకు 1.65 మిలియన్ల మంది సూడాన్‌వాసులు సొంత ప్రాంతాలను వీడారు. మరికొంతమంది దేశం దాటుతున్నారు. సుడాన్‌ డాక్టర్స్ సిండికేట్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఘర్షణల్లో సుమారు 900 మంది మృతి చెందారు. అందులో 200 మంది చిన్నారులే ఉన్నారు. వాస్తవంగా ఈ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. 13.6 మిలియన్ల మంది చిన్నారులకు అత్యవసర మానవతా సాయం అవసరమని యునిసెఫ్ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని