Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 61కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో బాంబు పేలుడు ఘటనలో 61మంది మృతిచెందగా.. 150మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
(బాంబు పేలుడు ధాటికి కుప్పకూలిన మసీదు పైకప్పు)
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan)లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. ఓ మసీదు లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం బాంబు దాడికి తెగబడ్డారు. పెషావర్(Peshawar)లోని ఓ మసీదులో సోమవారం భారీ బాంబు పేలుడు (Bomb blast) ఘటనలో మృతుల సంఖ్య 61కి చేరగా.. 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. పెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. అనేకమంది క్షతగాత్రులు తమ ఆస్పత్రిలో చేరినట్లు పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి అధికార ప్రతినిధి మహమ్మద్ అసీం తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు మధ్యాహ్నం తెలిపారు. మరోవైపు, మసీదులో బాంబు పేలుడు ఘటనకు బాధ్యత తమదేనంటూ తెహ్రిక్- ఐ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించుకుంది.
ఈ ఘటనపై పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ అధికారి మహ్మద్ ఇజాజ్ ఖాన్ మాట్లాడుతూ.. పేలుడు తర్వాత మసీదు పైకప్పు కూలిపోయిందన్నారు. ఈ శిథిలాల కింద చాలా మంది జవాన్లు చిక్కుకుపోగా వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 250 నుంచి 300 మంది పట్టే ప్రధాన హాలులో పైకప్పు కూలిపోయిందని.. మిగతా భవనం చెక్కు చెదరలేదన్నారు. దాదాపు 300 నుంచి 400 మంది పోలీసు సిబ్బంది పేలుడు జరిగిన ఘటనలో అక్కడ ఉన్నారని.. భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగిన సమయంలో పోలీసులు, సైన్యం, బాంబు నిర్వీర్య దళం సిబ్బంది అక్కడే ప్రార్థనల్లో ఉన్నట్టు సమాచారం.
పెషావర్ చేరుకున్న పాక్ ప్రధాని!
ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లాతో కలిసి పెషావర్‌కు చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రక్తాన్నిదానం చేసేందుకు పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ముందుకు రావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎల్‌ఆర్‌హెచ్ ఆస్పత్రి వద్దకు త్వరగా వచ్చి విలువైన ప్రాణాలు కాపాడటంతో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.
ఈ ఘటనలో మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ఎల్‌ఆర్‌హెచ్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది కూడా పెషావర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొచా రిసల్దార్ ప్రాంతంలోని షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రోడ్లను మూసివేసిన అధికారులు రెడ్‌జోన్ ప్రకటించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి నిఘాను మెరుగుపరచాలని సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి