Ukraine Crisis: ఉక్రెయిన్‌లో 816 మంది పౌరుల మృతి: ఐరాస

ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు దాదాపు 816 మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం......

Published : 18 Mar 2022 21:33 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 23వ రోజుకు చేరుకున్నాయి. సైనిక చర్య పేరుతో నివాస గృహాలే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తోంది. రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి మార్చి 17 వరకు ఉక్రెయిన్‌లో దాదాపు 816 మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌) తాజాగా వెల్లడించింది. మరో 1,333 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. ఫిరంగులు, మల్టీపుల్‌ లాంచ్ రాకెట్ వ్యవస్థల నుంచి భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగానే ఎక్కువ మంది మరణించారని స్పష్టం చేసింది. తీవ్రంగా దెబ్బతిన్న మేరియుపోల్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రాని నేపథ్యంలో.. మరణాల సంఖ్య ఇంకా భారీగానే ఉంటుందని ఐరాస అంచనా వేసింది.

ఇదిలా ఉంటే.. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి రాజధాని కీవ్‌లో ఇప్పటివరకు 222 మంది మృతి చెందారని స్థానిక పాలనాయంత్రాంగం శుక్రవారం వెల్లడించింది. కాగా వీరిలో 60 మంది పౌరులు, నలుగురు చిన్నారులు ఉన్నారని ఓ ప్రకటనలో పేర్కొంది. మరో 889 మంది గాయపడ్డారని, వారిలో 241 మంది పౌరులున్నారని తెలిపింది.

థియేటర్‌పై పేలుడులో 130 మందిని రక్షించాం

వైమానిక దాడుల్లో ధ్వంసమైన మేరియుపోల్‌లోని థియేటర్ నుంచి ఇప్పటివరకు 130 మందిని రక్షించినట్లు ఉక్రెయిన్ మానవ హక్కుల ప్రతినిధి లియుడ్మిలా డెనిసోవా తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ ఇంకా అనేకమంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. దాడులు జరగకముందు అందులో దాదాపు వేయిమంది పౌరులు ఆశ్రయం పొందినట్లు వార్తలు వచ్చాయి. కాగా అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు