AUKUS సబ్‌మెరైన్ ఒప్పందం.. భగ్గుమన్న డ్రాగన్‌

ఆకస్‌(AUKUS) కూటమి ప్రకటించిన సబ్‌మెరైన్ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని మండిపడింది. 

Published : 15 Mar 2023 01:19 IST

బీజింగ్‌: అమెరికా(America)కు చెందిన ఐదు అణు జలాంతర్గాముల(nuclear-powered submarines) కొనుగోలు ప్రణాళికలను తాజాగా ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు ఏర్పడిన ఆకస్‌(AUKUS)లోని ఈ దేశం చేసిన ప్రకటనపై డ్రాగన్ భగ్గుమంటోంది. ఆ కూటమి దేశాలు తప్పుడు, ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తున్నాయని మండిపడింది. 

అమెరికాAmerica), ఆస్ట్రేలియా(Australia), బ్రిటన్‌(United Kingdom) కలిసి ఆకస్‌(AUKUS) పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. 18 నెలల క్రితం ఈ కూటమి ఏర్పడింది.  ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేథ, సైబర్‌ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. ఈ క్రమంలోనే అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఆస్ట్రేలియాకు సాయం అందిస్తాయి. ఈ క్రమంలో ఆకస్‌ సబ్‌మరైన్‌ డీల్‌ను ఆవిష్కరించారు.

దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. ‘తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్.. అంతర్జాతీయంగా వస్తోన్న ఆందోళనలను  పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. వారు కేవలం వారి భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. వారు ప్రమాదకరమైన, తప్పుడు మార్గంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వానికి నిదర్శమని తెలిపారు. అలాగే ఈ విక్రయం అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతమని వ్యాఖ్యానించారు. 

యూఎస్‌(US)కు చెందిన ఐదు అణు జలాంతర్గాములను కొనుగోలు చేస్తామని, తర్వాత యూఎస్‌, బ్రిటిష్ సాంకేతికతతో కొత్త మోడల్‌ను నిర్మిస్తామని ఈ ఒప్పందం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని