Seagrass: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క.. ఏకంగా 180 కి.మీ మేర విస్తరణ!

ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను ఆస్ట్రేలియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ‘షార్క్‌ బే’లో నీటి అడుగున పెరుగుతున్న ఈ మొక్క.. ఏకంగా 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి...

Published : 03 Jun 2022 01:35 IST

కాన్‌బెర్రా: ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను ఆస్ట్రేలియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ‘షార్క్‌ బే’లో నీటి అడుగున పెరుగుతున్న ఈ మొక్క ఏకంగా 180 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. దీనికి సంబంధించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఫ్లిండర్స్‌ యూనివర్సిటీల పరిశోధకులు చేపట్టిన అధ్యయన వివరాలు.. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్‌ ది రాయల్ సొసైటీ బీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే, అదే ప్రపంచంలో అతిపెద్ద మొక్క అనే విషయం అనుకోకుండా బయటపడటం విశేషం. షార్క్‌ బేలోని సముద్ర గడ్డి జన్యు వైవిధ్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో ఇది వెలుగు చూసింది. మొదటగా ఈ మొక్కను ఓ పెద్ద సముద్ర గడ్డి (సీ గ్రాస్‌) మైదానంగా భావించారు. కానీ, అనంతరం అదంతా ఒకే విత్తనం నుంచి విస్తరించిన మొక్కగా కనుగొన్నారు.

‘పోసిడోనియా ఆస్ట్రేలిస్’ సముద్ర గడ్డి జాతికి చెందిన ఈ మొక్క.. దాదాపు 4,500 ఏళ్ల నాటిదని, 180 కిలోమీటర్ల విస్తరించి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం భూమిపై ఏ వాతావరణంలోనైనా పెరుగుతోన్న మొక్కల్లో ఇదే అతి పెద్దదని వివరించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన జీవ శాస్త్రవేత్త, సహ అధ్యయనకర్త ఎలిజబెత్ సింక్లైర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘షార్క్‌ బేలో సముద్ర గడ్డికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించినప్పుడు మేం ఆశ్చర్యపోయాం. ప్రతిదీ ఒకే మొక్కకు చెందిందని దానిలో తేలింది’ అని వెల్లడించారు. ఏపుగా పెరగడం ద్వారా కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకొనే సామర్థ్యాన్ని ఈ మొక్క పెంపొందించుకుందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు