Australia: సందర్శకులకూ ఆస్ట్రేలియా అనుమతి.. 21 నుంచి ఆంక్షల సడలింపు

ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్‌ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్‌ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. ఈ మేరకు సోమవారం...

Published : 07 Feb 2022 14:31 IST

కాన్‌బెర్రా: ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్‌ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్‌ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఆస్ట్రేలియా.. 2020 మార్చి నుంచి అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. స్థానికంగా వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో.. గతేడాది నవంబర్‌లో సరిహద్దు ఆంక్షలను కాస్త సడలించింది. అయితే, ఆ సమయంలో అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చింది.

తాజాగా.. ఫిబ్రవరి 21 నుంచి టీకాలు పూర్తయిన వీసా హోల్డర్లందరూ తమ దేశానికి రావొచ్చని ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రకటించారు. సందర్శకులందరూ తప్పనిసరిగా టీకా ఆధారాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీకాకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి పంపించివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, టీకా ఎందుకు వేయించుకోలేదో వైద్యపరమైన కారణాలు చూపగలిగే వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. మహమ్మారి పరిణామాలతో దాదాపు రెండేళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉన్న పర్యాటక రంగానికి తాజా నిర్ణయంతో ఉపశమనం కలిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని