WFH: ‘వర్క్‌ఫ్రమ్‌ హోం’పై కుబేరుల కొట్లాట..!

‘కార్యాలయానికి వచ్చి పనిచేయండి.. లేదంటే సంస్థను వీడిపోండి’ అంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా సంపన్నుడి నుంచి ప్రతిస్పందన ఎదురయ్యింది.

Published : 03 Jun 2022 16:32 IST

ఎలాన్‌ మస్క్‌ హెచ్చరికపై ఆస్ట్రేలియా సంపన్నుడి స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇక నుంచి తమ సంస్థ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం లేదని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఘాటు హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. ‘కార్యాలయానికి వచ్చి పనిచేయండి.. లేదంటే సంస్థను వీడిపోండి’ అంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా సంపన్నుడి నుంచి ప్రతిస్పందన ఎదురయ్యింది. ఎక్కడ నుంచైనా పనిచేసే సౌలభ్యాన్ని తమ సంస్థ కల్పిస్తోందన్న ఆయన.. టెస్లా ఉద్యోగులకు ఆసక్తి ఉందా.? అంటూ ఆఫర్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. ఆర్థిక మాంద్యం వల్ల కీలకమైన ప్రక్షాళన చర్యలు ఎందుకు చేపట్టాలో మీ వరుస ట్వీట్‌లు వివరిస్తున్నాయంటూ బదులిచ్చారు.

‘టెస్లా ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆఫీస్‌ నుంచే పనిచేయాలి. ఇందుకు సిద్ధంగా లేనివారిని రాజీనామా చేసినట్లుగా భావిస్తాం’ అంటూ టెస్లా ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనే మూడో సంపన్నుడు, అట్లాసియన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సహ-వ్యవస్థాపకుడు స్కాట్‌ ఫర్కుహర్‌ స్పందించారు. మస్క్‌ తీసుకున్న నిర్ణయం 1950కాలం నాటి మాదిరిగా కనిపిస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎక్కడనుంచైనా పనిచేసే విధానమే తమ సంస్థ ఎదుగుదలకు దోహదపడుతుందంటూ వరుస ట్వీట్‌లు చేశారు. 2026 ఆర్థిక సంవత్సరానికి 25వేల మంది ఉద్యోగులను కలిగివుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఎవరైనా టెస్లా ఉద్యోగులకు ఆసక్తి ఉందా..? అంటూ ప్రశ్నించారు.

ఆస్ట్రేలియా సంపన్నుడి స్పందనకు ఎలాన్‌ మస్క్‌ కూడా ఘాటుగానే బదులిచ్చారు. పైన పేర్కొన్న వరుస ట్వీట్లు.. ఆర్థిక మాంద్యం వల్ల కీలకమైన ప్రక్షాళన చర్యలు ఎందుకు చేపట్టాలో మీ వరుస ట్వీట్‌లు వివరిస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే, సమకాలీన అంశాలపై సోషల్‌ మీడియాలో తరచుగా స్పందించే ఎలాన్‌ మస్క్‌.. సున్నిత విషయాలపైనా తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తుంటారు. ఇక రానున్న రోజుల్లో ఆర్థికవ్యవస్థకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తమ సంస్థలో ఉద్యోగ నియామకాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని తొలగించాల్సిన అవసరం కూడా ఉందని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని