Japan: పసిబిడ్డల్ని ఏడిపించి.. వేడుక చేసుకున్నారు..!

జపాన్‌ వాసులు ఈ రోజు వింత సంప్రదాయాన్ని నిర్వహించారు. తమ పిల్లల్ని బాగా ఏడిపించారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

Published : 23 Apr 2023 01:41 IST

టోక్యో: శనివారం జపాన్‌(Japan ) ప్రజలు తమ పసిబిడ్డలను ఏడిపించారు..! తమ బిడ్డ మొదటగా, బిగ్గరగా ఏడ్వాలని ప్రతి తల్లీతండ్రి కోరుకున్నారు..! ఇదేం విడ్డూరమని ఆ కుటుంబాలపై కోపం వస్తుందా..? కానీ జపాన్‌లో ఇది శతాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయమని తెలుసా మరి..! (Crying Sumo Festival)

కరోనాతో కొన్నేళ్లుగా ఆగిన ఈ సంప్రదాయాన్ని శనివారం జపాన్‌(Japan ) వ్యాప్తంగా పలు ఆలయాల్లో నిర్వహించారు. దీని ప్రకారం.. చిన్నారులకు సుమో ఆప్రాన్స్‌ వేస్తారు. ఇద్దరు ఇద్దరిగా ఆ పిల్లల్ని సుమో రింగ్‌లోకి తీసుకెళ్లి సుమోలకు ఇస్తారు. వారు చిన్నారులను ఎత్తిపట్టి ఇద్దరు ఢీ కొన్నట్టుగా పోటీ పెడతారు. ఈ ప్రక్రియలో ఎవరు ముందుగా ఏడుస్తారో వారే గెలిచినట్టు. ఒక్కోసారి ఒకవైపు ఉన్నవారు ఏడ్చినా.. మరోవైపు సుమో చేతిలో ఉన్నవారి కంటిలో చుక్కనీరు రాదు. అప్పుడు భయపెట్టే ఆకృతిలో ఉన్న డెమన్‌ మాస్కులు ధరించి వారిని ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ‘పిల్లలు ఏడుపు శబ్దాన్ని బట్టి వారి ఆరోగ్యాన్ని మేం అంచనా వేస్తాం. ఈ రోజు నా బిడ్డ కంగారు పడి, అంతగా ఏడ్వకపోవచ్చు. కానీ ఏడుపు ద్వారా ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా’  అని ఎనిమిది నెలల పాప తల్లి ఒకరు వెల్లడించారు.

ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించిన అసకుసా టూరిజం ఫెడరేషన్ ఛైర్మన్ షిగెమీ ఫుజీ మాట్లాడుతూ.. ‘పిల్లల్ని ఏడిపించడం కొందరు ఒక భయంకరమైన చర్యగా చూస్తారు. కానీ పిల్లలు ఎవరు గట్టిగా ఏడుస్తారో.. వారు ఆరోగ్యంగా ఎదుగుతారని మా నమ్మకం. జపాన్‌(Japan)లో చాలా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం(Crying Sumo Festival) కొనసాగుతోంది. ఈ రోజు మేం నిర్వహించిన కార్యక్రమంలో 64 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంప్రదాయంలో పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొదట ఏడ్చిన బిడ్డ గెలిచినట్టు భావిస్తారు. మరికొన్ని చోట్ల దానిని ఓటమిగా చూస్తారు’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని