China Lockdown: ఆంక్షల గుప్పిట్లో చైనా నగరాలు.. ఇక బీజింగ్ వంతు..!

చైనా రాజధాని బీజింగ్‌లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నగర పరిధిలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు.

Published : 26 Apr 2022 01:43 IST

భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతోన్న చైనాలో ఇప్పటికే పలు నగరాలు లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి. రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘై గత మూడు వారాలుగా దిగ్బంధంలోనే ఉండిపోగా తాజాగా మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలకు చైనా అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చైనా రాజధాని బీజింగ్‌లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నగర పరిధిలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో నగరం మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తారనే బీజింగ్‌ వాసుల భయంతో అక్కడి సూపర్‌ మార్కెట్లన్నీ ఖాళీ అవుతున్నాయి.

భారీ స్థాయిలో పరీక్షలు..

గత కొన్ని రోజులుగా రాజధాని బీజింగ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా 30లక్షలకుపైగా జనాభా కలిగిన చావోయాంగ్‌లో 46 కేసులు బయటపడ్డాయి. ఆ జిల్లా మొత్తం కొవిడ్‌ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అక్కడి కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఇతర ప్రాంతాలను నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు విధించారు. కేవలం కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇలా ఆంక్షలు కఠినతరం చేస్తోన్న నేపథ్యంలో బీజింగ్‌ మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతాలైన అన్‌యాంగ్‌, డాన్‌డోంగ్‌ ప్రాంతాల్లోనూ ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

సూపర్‌ మార్కెట్లు ఖాళీ..

2.1 కోట్ల జనాభా కలిగిన చైనా రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 70 కేసులు వెలుగు చూశాయి. దీంతో కఠిన చర్యలకు ఉపక్రమించిన అధికారులు వైరస్‌ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. బీజింగ్‌లోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో నగరం మొత్తం అమలు చేస్తారనే ఆందోళన అక్కడి ప్రజల్లో మొదలైంది. బియ్యం, నూడిల్స్‌, కూరగాయలతోపాటు ఇతర ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు నిల్వ చేసుకునేందుకు బీజింగ్‌ వాసులు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో సెంట్రల్‌ బీజింగ్‌లోని సూపర్‌మార్కెట్ల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే, డిమాండ్‌కు సరిపడా సరుకులను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

షాంఘైలో పెరుగుతోన్న మరణాలు

మరోవైపు షాంఘైలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే మరో 51 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 100 దాటింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఇలా కఠిన ఆంక్షలతో సతమతమవుతోన్న షాంఘై వాసులు ప్రభుత్వతీరుపై మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని