South China Sea: పశ్చిమదేశాలకు హెచ్చరికగా చైనా యుద్ధవిన్యాసాలు

పశ్చిమదేశాలకు హెచ్చరికగా చైనా రేపటి నుంచి మరోసారి దక్షిణ చైనా సముద్రంలో యుద్ధవిన్యాసాలకు సిద్ధమైంది. పశ్చిమదేశాలు గత వారం రోజులుగా పసిఫిక్‌ సముద్రంలో పట్టుకోసం

Published : 27 May 2022 20:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమదేశాలకు హెచ్చరికగా శనివారం నుంచి చైనా మరోసారి దక్షిణ చైనా సముద్రంలో యుద్ధవిన్యాసాలకు సిద్ధమైంది. పశ్చిమదేశాలు గత వారం రోజులుగా పసిఫిక్‌ సముద్రంలో పట్టుకోసం పలు ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో హైనాన్‌ ద్వీపానికి 25 కిలోమీటర్ల లోపు ఈ విన్యాసాలు జరగనున్నాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి పసిఫిక్‌లోని ద్వీపాల వరకు పెరిగిపోతున్న చైనా ఆర్థిక, సైనిక బలంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో ఇవి జరగడం విశేషం. శనివారం ఈ యుద్ధ విన్యాసాలు జరిగే దాదాపు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో మార్గాలను మూసివేస్తామని మారిటైమ్‌ సేఫ్టీ అడ్మిన్‌స్ట్రేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే వారం నుంచి హైనాన్‌లోని మరో ప్రాంతంలో కూడా యుద్ధవిన్యాసాలు జరగనున్నాయి. 

ఇటీవల అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ తైవాన్‌ తనదిగా పేర్కొంటూ చైనా ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ‘‘బీజింగ్‌ ఉద్రిక్తతలను పెంచేలా నిత్యం యుద్ధవిమానాలను తైవాన్‌ సమీపం నుంచి తీసుకెళుతున్నారు’’ అని ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తైవాన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించిన తర్వాత బ్లింకన్‌ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఈ ఆరోపణలతో అమెరికా-చైనా మధ్య వాగ్యుద్ధానికి తెరలేచింది. తైవాన్‌ విషయంలో తమ జాతీయ ప్రయోజనాలను చైనా సమర్థించుకొంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించింది. 

ఇటీవల చైనాకు చెందిన పీఎల్‌ఏ అధికారులు తైవాన్‌ ఆక్రమణ ప్రణాళికలపై చర్చిస్తున్న ఆడియో లీకైంది. దీనిపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని