china: చైనాలో ‘పాక్స్‌లోవిడ్‌’ ఉచిత పంపిణీ..!

చైనాలో కరోనా తీవ్రతను తట్టుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘పాక్స్‌లోవిడ్‌’ను ఉచితంగా పంచాలని నిర్ణయించింది.

Updated : 27 Dec 2022 11:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫైజర్‌ రూపొందించిన కరోనా(Covid19) ఔషధం ‘పాక్స్‌లోవిడ్‌’ను బీజింగ్‌లో పంపిణీ చేసేందుకు చైనా(china) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నగరంలోని హెల్త్‌ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ రంగ మీడియా సోమవారం వెల్లడించింది. ఇప్పటికే బీజింగ్‌ కొవిడ్‌ (Covid19) గుప్పిట్లో విలవిల్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వైద్యశాలలు కిక్కిరిసిపోగా.. ఫార్మసీల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికే పాక్స్‌లోవిడ్‌ వినియోగంపై ఇక్కడి కమ్యూనిటీ వైద్యులకు శిక్షణ, సూచనలు కూడా ఇచ్చారు. కాకపోతే పంపిణీ ఎప్పటి నుంచి మొదలుపెడతారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చైనా(china)లో కొవిడ్‌ (Covid19)చికిత్సలో వినియోగించడానికి అనుమతి పొందిన విదేశీ ఔషధం పాక్స్‌లోవిడ్‌ ఒక్కటే. ప్రస్తుతం ఇది చైనా(china)లో లభించడంలేదు. గతంలో చైనా(china) రూపొందించిన ‘అజ్వుడిన్‌’ అనే కొవిడ్‌ (Covid19) ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురాగా.. కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి.

మరోవైపు దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ స్పందించినట్లు చైనా(china) మీడియా సంస్థ సీసీటీవీ పేర్కొంది. కొవిడ్‌ లక్షిత వ్యూహాలను అనుసరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారని వెల్లడించింది. ‘‘ప్రస్తుతం దేశం కొత్త కొవిడ్‌ అవుట్‌ బ్రేక్‌ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో మనం ఎంతో దేశభక్తితో ఈ ఆరోగ్య ఉద్యమాన్ని లక్ష్యం దిశగా నడిపించాలి’’ అని పేర్కొన్నట్లు వివరించింది. చైనా(china)లో కొవిడ్‌ విజృంభించిన తర్వాత షీజిన్‌పింగ్‌ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే. చైనాలో నిర్విరామంగా పనిచేస్తుండటంతో వైద్యులు చాలా మంది అనారోగ్యం బారినపడుతున్నారు. చాలా మంది డాక్టర్లల్లో జ్వర లక్షణాలు కనిపిస్తున్నా.. పేషెంట్లకు సేవ చేస్తున్నారు. దీంతో చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని