Ukraine war: ఉక్రెయిన్‌ యుద్ధంలో తలదూర్చేందుకు బెలారస్‌ సిద్ధం..!

పొరుగు దేశాల నుంచి వచ్చే కవ్వింపులకు స్పందించేలా తమ సైన్యం, ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయని బెలారస్‌ విదేశాంగశాఖ మంత్రి వ్లాదిమిర్‌ మేకీ అన్నారు.

Published : 14 Oct 2022 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో తలదూర్చేందుకు బెలారస్‌ సిద్ధమవుతోంది. ఈ విషయంపై బెలారస్‌ విదేశాంగశాఖ మంత్రి వ్లాదిమిర్‌ మేకీ  ఓ రష్యా పత్రికతో మాట్లాడుతూ.. పొరుగు దేశాల నుంచి వచ్చే కవ్వింపులకు స్పందించేలా తమ సైన్యం, ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ వారం బెలారస్‌లో సైనిక కదలికలు తీవ్రమైన సమయంలో వ్లాదిమిర్‌ మేకీ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యాకు సంపూర్ణ మద్దతు ప్రకటనించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యా బలగాలతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద మోహరించాలని ఆయన బెలారస్‌ సైన్యాన్ని ఆదేశించారు. 

మరోవైపు వార్షిక అణు దళాల విన్యాసాలు నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పుతిన్‌ అణు హెచ్చరికలు కూడా జారీ చేయడంతో నాటో, అమెరికాలు అప్రమత్తమైపోయాయి. నిన్న నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోలెన్‌బెర్గ్‌ మాట్లాడుతూ ‘‘ఎప్పటిలానే ప్రతి కదలికను గమనిస్తుంటాం. మేం అప్రమత్తంగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.

మరోవైపు జపొరొజియా అణుకేంద్రం డిప్యూటీ హెడ్‌ను రష్యా దళాలు కిడ్నాప్‌ చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ ప్రభుత్వ రంగ అణు విద్యుత్తు సంస్థ ఎనర్గోటామ్‌  తెలిపింది. ప్రస్తుతం అతడిని రష్యా దళాలు గుర్తు తెలియని ప్రదేశంలో బంధించాయని ఆ సంస్థ టెలిగ్రాం యాప్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని