US: భారత్‌.. రష్యాపై ఆధారపడటం తగ్గించుకోవాలి: అమెరికా

ఎనర్జీ, భద్రతకు సంబంధించి రష్యా నమ్మదగిన దేశం కాదని అనేక దేశాలు గుర్తించాయని అమెరికా తెలిపింది. మాస్కోకు దూరమయ్యేలా భారత్‌కు అన్ని విధాల సహకరిస్తామని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది.

Updated : 09 Nov 2022 13:37 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం వేళ.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లను కొనసాగించడంపై కొంతకాలంగా అసంతృప్తి వెళ్లగక్కుతోంది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా భారత్‌-రష్యా బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కాలానుగుణంగా న్యూదిల్లీ.. మాస్కోపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించింది. క్రెమ్లిన్‌కు దూరమవడానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది.

‘‘ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్‌, రష్యా మధ్య మొదలైన మైత్రి.. దశాబ్దాలు గడిచిన కొద్దీ మరింత బలపడింది. ఆ సమయంలో భారత్‌కు సైనిక, భద్రత, ఆర్థిక భాగస్వామిగా ఉండే స్థాయిలో అమెరికా లేదు. కానీ, ఆ తర్వాత గత 25ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఇది ఒక్క రాత్రిలో సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ల గురించి అడిగిన ప్రశ్నకు కూడా నెడ్‌ ప్రైస్‌ బదులిచ్చారు. ‘‘మాస్కోపై విధించిన ఆంక్షల నుంచి చమురు, గ్యాస్‌, ఎనర్జీ రంగాలను అమెరికా ఉద్దేశపూర్వకంగానే మినహాయించింది. భారత్‌లో ఇంధన డిమాండ్ అధికంగా ఉంది. అందుకే రష్యా నుంచి కొనుగోళ్లు చేయక తప్పట్లేదు. ఇది మాస్కోపై విధించిన ఆంక్షలను అధిగమించడం కాదు. అయితే రష్యాతో ఎప్పటిలాగే వాణిజ్యం కొనసాగించేందుకు ఇది సరైన సమయం కాదని అమెరికా భావిస్తోంది. ఎనర్జీ, భద్రతకు సంబంధించి మాస్కో నమ్మదగిన వనరు కాదని ఇప్పటికే చాలా దేశాలు తెలుసుకున్నాయి. ఏ విషయంలోనూ రష్యా విశ్వసనీయమైనది కాదు. అందువల్ల, కేవలం ఉక్రెయిన్‌ ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా.. భారత సమష్టి ప్రయోజనాల దృష్ట్యా న్యూదిల్లీ కాలక్రమేణా రష్యాపై ఆధారపడటం తగ్గించుకోవాలి’’ అని నెడ్‌ ప్రైస్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని